ICC World Cup 2023 schedule: కేసీఆర్ ఆ నిర్ణయమే.. క్రికెట్ ఫ్యాన్స్ కొంపముంచిందా..!

భారత్ వేదికగా అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది.

Update: 2023-06-27 10:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ వేదికగా అక్టోబర్-నవంబర్‌లో జరగనున్న ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. లీగ్ దశలో 10 జట్లు మొత్తం 45 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఒక్కో జట్టు తొమ్మిదేసి మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్‌ 8న ఆస్ట్రేలియాతో భారత్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుండగా.. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరిగే మ్యాచ్‌లో దాయాదీ పాకిస్థాన్‌తో తలపడనుంది. నవంబర్‌ 15, 16న ముంబై, కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనుండగా.. అహ్మదాబాద్‌ వేదికగా నవంబర్‌ 19న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

అయితే హైదరాబాద్‌ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుండగా.. ఇందులో టీమిండియా మ్యాచ్ లేకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఉప్పల్ స్టేడియానికి కేటాయించిన 3 మ్యాచ్‌ల్లో అక్టోబర్ 5న ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనుండగా.. అక్టోబర్ 6న పాకిస్థాన్, క్వాలిఫయర్-1, అక్టోబర్ 12న పాకిస్థాన్, క్వాలిఫయర్-2 జట్లు తలపడనున్నాయి. ఆ తర్వాత హైదరాబాద్ వేదికగా ఒక్క మ్యాచ్ కూడా లేదు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) నిర్లక్ష్యం కారణంగానే ఉప్పల్ వేదికగా టీమిండియా మ్యాచ్ లేదని చాలా మంది అనుకుంటున్నారు.

కానీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కారణంగానే హైదరాబాద్ వేదికగా అక్టోబర్ 12 తర్వత ఒక్క మ్యాచ్ కూడా కేటాయించలేదని.. అక్టోబర్‌ 12 తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది తెలుస్తోంది. ఎన్నికల నేపథ్యంలో భద్రతా సమస్యలు ఏర్పడుతాయనే కేంద్ర హోంశాఖ సూచనలతో బీసీసీఐ.. హైదరాబాద్‌ వేదికకు మూడు మ్యాచ్‌లకే పరిమితం చేసిందని సమాచారం. ఈ కారణంగానే టీమిండియా మ్యాచ్‌లను కూడా కేటాయించలేకపోయింది. అలాగే 2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతో క్రికెట్ అభిమానులకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. అప్పుడు ముందస్తు ఎన్నికలకు వెళ్లకుంటే ఇప్పుడు ఇంత త్వరగా ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం వచ్చేది కాదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.

అక్టోబర్ 12లోపు టీమిండియా రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడనుంది. ఆస్ట్రేలియాతో అక్టోబర్ 8న చెన్నై వేదికగా తొలి మ్యాచ్ ఆడనున్న భారత్.. అక్టోబర్ 11న అఫ్గానిస్థాన్‌తో ఢిల్లీ వేదికగా రెండో మ్యాచ్ ఆడనుంది. కనీసం ఈ రెండు మ్యాచ్ ఐన హైదరాబాద్‌కు కేటాయించాలనుకున్న బీసీసీఐకి పాకిస్థాన్ అడ్డంకిగా మారింది. ఆ జట్టు హైదరాబాద్‌ను వేదికగా ఎంచుకోవడంతో రెండు మ్యాచ్‌లను కేటాయించింది. ఏది ఏమైనా హైదరాబాద్‌లో టీమిండియా మ్యాచ్ లేకపోవడంపై ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

Read More..

India ODI World Cup 2023 schedule : టీమ్ ఇండియా షెడ్యూల్ ఇదే..  

Tags:    

Similar News