ICC World Cup 2023: చిత్తుగా ఓడిన నెదర్లాండ్స్.. కంగారూలకు రికార్డు విజయం
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో భాగంగా ఢిల్లీ వేదికగా నెదర్లాండ్స్‌తో జరుగుతున్న 24వ లీగ్ మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా ప్రతాపం చూపింది. నెదర్లాండ్స్ జట్టును ఏకంగా 309 పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించింది. సౌతాఫ్రికాపై సంచలన విజయంతో జోష్‌లో ఉన్న నెదర్లాండ్స్ జట్టు ఉత్సాహాన్ని నీరుగారుస్తూ సమిష్టి ప్రదర్శనతో వార్ వన్‌సైడ్ చేసింది. తద్వారా ప్రపంచకప్ టోర్నీలో అత్యంత భారీ విజయం నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా..309 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసి 399 పరుగులు చేసిన ఆస్ట్రేలియా.. ఆ తర్వాత నెదర్లాండ్స్‌ను 90 కే పరిమితం చేసింది. ఫలితంగా కంగారూలు.. 309 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్ రేసులో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు.
ఆసీస్ నిర్దేశించిన 400 పరుగుల ఛేదనలో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఏ దశలోనూ పోటీనివ్వలేదు. 28 పరుగులకే ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ స్టార్క్ నెదర్లాండ్స్ పతనాన్ని ప్రారంభించాడు. ఆ తర్వాత డచ్ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. విక్రమ్ జిత్ సింగ్ (25), అకర్‌మన్ (10), బస్ డీ లీడ్ (4), సిబ్రండ్ (11) లు క్రీజులో నిలబడటానికే నానా తంటాలు పడ్డారు. 62 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన దశలో కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (12 నాటౌట్), తేజ నిడమనూరు (18 బంతుల్లో 14, 2 ఫోర్లు) తో కలిసి ఆరో వికెట్‌కు 22 పరుగులు జతచేశాడు. తేజను మిచెల్ మార్ష్ ఔట్ చేశాక తర్వాత వచ్చిన ఇద్దరు బ్యాటర్లు లొగాన్ వాన్ బీక్, వాన్ డెర్ మెర్వ్‌లు సున్నాలు చుట్టారు. వాన్ డెర్ మెర్వ్ చివరి వికెట్‌గా వెనుదిరగడంతో నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ 90 వద్ద ముగిసింది. ఆసీస్ బౌలర్లలో జంపాకు 4 వికెట్లు తీయగా.. మార్ష్ 2 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్, హెజిల్‌వుడ్, కమిన్స్‌లకు తలా ఓ వికెట్ దక్కింది. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో పరుగులపరంగా ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. వన్డేలలో భారత జట్టు.. 317 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి ఈ జాబితాలో ప్రథమ స్థానంలో ఉంది.
అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ భారీ స్కోరు చేసింది. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీతో చెలరేగాడు. ఆఖరిలో గ్లెన్ మాక్స్‌వెల్ కేవలం 44 బాల్స్‌లోనే 106 పరుగులతో మెరుపు సెంచరీ చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 8 సిక్సిర్లు ఉన్నాయి. దీంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్‌లకు 8 వికెట్లు కోల్పోయి 399 పరుగుల భారీ స్కోరు చేసింది. 40 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తిచేసిన వార్నర్.. 91 బంతుల్లో 11 బౌండరీలు, 3 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు. ఈ సెంచరీతో వార్నర్.. వరల్డ్ కప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ (7) తర్వాత ఆరు సెంచరీలతో సచిన్ టెండూల్కర్‌తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. ఆసీస్ మిగిలిన బ్యాటర్స్‌లో.. స్టీవెన్ స్మిత్ (71), మార్నస్ (62) పరుగులతో రాణించారు. నెదర్లాండ్స్ బౌలర్‌లో.. లోగాన్ వాన్ బీక్ 4, బాస్ డి లీడే 2 వికెట్లు పడగొట్టగా.. ఆర్యన్ దత్ ఒక వికెట్ తీశాడు.