బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. ఆఖరి మ్యాచ్‌కు షకీబ్ దూరం

Update: 2023-11-07 13:47 GMT

న్యూఢిల్లీ : వన్డే ప్రపంచకప్‌‌‌లో బంగ్లాదేశ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. ఈ నెల 11న ఆస్ట్రేలియాతో టోర్నీలో చివరి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బంగ్లాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ గాయం కారణంగా చివరి మ్యాచ్‌కు దూరమయ్యాడు. సోమవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో షకీబ్ ఎడమ చేతి వేలికి గాయమైంది. అయినప్పటికీ అతను బ్యాటింగ్ కొనసాగించడంతో గాయం తీవ్రమైంది.

మ్యాచ్ అనంతరం ఎక్స్‌రే తీయగా.. వేలు ఫ్రాక్చర్ అయినట్టు తేలిందని టీమ్ ఫిజియో బైజెదుల్ ఇస్లాం ఖాన్ తెలిపాడు. కోలుకోవడానికి మూడు లేదా నాలుగు నెలలు పడుతుందని చెప్పాడు. షకీబ్ స్థానంలో కెట్ కీపర్ అనముల్ హక్‌ జట్టులోకి వచ్చాడు. అలాగే, చివరి మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ శాంటో జట్టును నడిపించనున్నాడు. కాగా, శ్రీలంకపై షకీబ్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొదట బంతితో 2 వికెట్లతో రాణించిన అతను.. ఛేదనలో 65 బంతుల్లో 82 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.

Tags:    

Similar News