ICC World Cup 2023: 9 మ్యాచులు రీషెడ్యూల్.. భారత్-పాక్ మ్యాచ్ ​డేట్ ఫిక్స్​

భారత్ ​వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్​ 2023 షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఐసీసీ.

Update: 2023-08-09 13:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్ ​వేదికగా జరగనున్న వన్డే ప్రపంచ కప్​ 2023 షెడ్యూల్‌లో మార్పులు చేసింది ఐసీసీ. భారత్-పాకిస్థాన్​ మధ్య జరగనున్న మ్యాచ్​ తేదీని ప్రకటించింది. అహ్మదాబాద్‌ వేదికగా అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సహా మొత్తం 9 మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు జరిగాయి. ఈ విషయాన్ని ఐసీసీ ఇవాళ (ఆగస్ట్‌ 9) అధికారికంగా ప్రకటించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం.. అక్టోబర్‌ 15న జరగాల్సిన భారత్‌-పాక్‌ మ్యాచ్‌ ఒక రోజు ముందుకు (అక్టోబర్‌ 14) మారింది. ఢిల్లీ వేదికగా అక్టోబర్‌ 14న జరగాల్సిన ఆఫ్ఘనిస్తాన్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌ ఓ రోజు తర్వాత (అక్టోబర్‌ 15), అక్టోబర్‌ 12న హైదరాబాద్‌లో జరగాల్సిన పాకిస్తాన్‌-శ్రీలంక మ్యాచ్‌ అక్టోబర్‌ 10న, అక్టోబర్‌ 13న లక్నోలో జరగాల్సిన ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్‌ అక్టోబర్‌ 12న జరగనుంది.

చెన్నై వేదికగా న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య అక్టోబర్‌ 14న జరగాల్సిన మ్యాచ్‌ అక్టోబర్‌ 13న, ధర్మశాల వేదికగా నవంబర్‌ 11న ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ మధ్య జరగాల్సిన డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ అదే రోజు (నవంబర్‌ 11) డే మ్యాచ్‌ (10:30)గా, ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ మధ్య నవంబర్‌ 12 పూణే వేదికగా జరగాల్సిన మ్యాచ్‌ నవంబర్‌ 11కు, ఇంగ్లండ్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య కోల్‌కతా వేదికగా నవంబర్‌ 12న జరగాల్సిన మ్యాచ్‌ నవంబర్‌ 11కు, భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య బెంగళూరు వేదికగా నవంబర్‌ 11న జరగాల్సిన మ్యాచ్‌ నవంబర్‌ 12వ తేదీకి మారింది. భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌ అక్టోబర్‌ 5న మొదలై నవంబర్‌ 19న ముగుస్తుంది. టోర్నీ ఆరంభ, ఫైనల్‌ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది.


Similar News