ICC World Cup Qualifiers 2023: వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ విజేత శ్రీలంక.. నెదర్లాండ్స్‌పై ఘన విజయం

ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ విజేతగా శ్రీలంక జట్టు నిలిచింది.

Update: 2023-07-09 14:01 GMT

హరారే : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ విజేతగా శ్రీలంక జట్టు నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై 128 పరుగుల తేడాతో శ్రీలంక విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక‌ను నెదర్లాండ్స్ బౌలర్లు మోస్తరు స్కోరుకే పరిమితం చేశారు. 47.5 ఓవర్లోనే కుప్పకూలిన లంక జట్టు 233 పరుగులు చేసింది. సహన్ అరాచ్చిగె(57), కుసాల్ మెండిస్(43), అసలంక(36) రాణించి పోరాడే స్కోరును అందించారు. అయితే, శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టార్గెట్‌ను కాపాడుకున్నారు. ప్రత్యర్థిని 23.3 ఓవర్లలోనే కూల్చేశారు. మ్యాక్స్ ఓడౌడ్(33) టాప్ స్కోరర్.

నెదర్లాండ్స్ బ్యాటింగ్ లైనప్‌లో ఐదుగురు సింగిల్ డిజిట్‌కే వికెట్ సమర్పించుకోగా.. మరో ముగ్గురు డకౌటయ్యారు. దాంతో ఛేదనలో నెదర్లాండ్స్ 105 పరుగులకే ఆలౌటైంది. మహేశ్ తీక్షణ(4/31), దిల్షాన్ మధుశంక(3/18) ప్రత్యర్థి పతనాన్ని శాసించగా.. హసరంగ రెండు వికెట్లతో రాణించాడు. క్వాలిఫయర్స్‌లో శ్రీలంక ఒక మ్యాచ్‌ కూడా కోల్పోలేదు. మొత్తం ఎనిమిదింటికి ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ గెలుపొందింది. ఈ ఏడాది భారత్‌లో జరగబోయే వన్డే వరల్డ్ కప్‌కు శ్రీలంక, నెదర్లాండ్స్ అర్హత సాధించిన విషయం తెలిసిందే.


Similar News