ICC World Cup 2023: అందుకే వైజాగ్‌ స్టేడియానికి చోటు దక్కలేదు..!

భారత వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది.

Update: 2023-06-28 14:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత వేదికగా అక్టోబర్ 5వ తేదీ నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. మొత్తం 12 వేదికలను బీసీసీఐ ఎంపిక చేయగా.. రెండింట్లో వార్మప్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. మిగతా 10 వేదికల్లో ప్రపంచకప్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్రపంచకప్ టోర్నీకి సంబంధించిన వేదికల విషయంపై రాజకీయ రంగు పులుముకుంది. ఉద్దేశపూర్వకంగా కొన్ని రాష్ట్రాల్లో స్టేడియాలకు బీసీసీఐ మ్యాచ్‌లు కేటాయించలేదని, ముఖ్యంగా బీజేపీ అధికారంలో లేని రాష్ట్రల పట్ల వివక్ష చూపించిందని ప్రతిపక్ష నాయకులు మండిపడ్డారు. పంజాబ్‌లోని మోహాలీ, కేరళలోని తిరువనంతపురం, ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ స్టేడియాలను ఎంపిక చేయకపోవడంపై ఆయా రాష్ట్రాల నేతలు బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

పంజాబ్ క్రీడల మంత్రి గుర్మీత్ సింగ్‌ అయితే బీసీసీఐపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విమర్శలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించారు. ఐసీసీ స్టాండర్డ్స్‌కు తగ్గట్లు వైజాగ్, మోహాలీ స్టేడియాలు లేకపోవడంతోనే మ్యాచ్‌లు కేటాయించలేదని స్పష్టం చేశాడు. ఐసీసీ స్టాండర్డ్స్‌కు సరితూగకుంటే తాము ఏం చేయలేమని చెప్పాడు. సౌత్‌ జోన్‌ నుంచి నాలుగు, సెంట్రల్‌ జోన్‌ నుంచి ఒకటి, వెస్ట్‌ జోన్ నుంచి రెండు, నార్త్‌ జోన్ నుంచి రెండు వేదికలను ఎంపిక చేశారు. సౌత్ జోన్ నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, తిరవనంతపురం వేదికలను ఖారారు చేయడంతో వైజాగ్‌కు చోటు దక్కలేదు. అలాగే హైదరాబాద్‌లోనూ టీమిండియా మ్యాచ్‌లు లేవు. దాంతో తెలుగు అభిమానులు బీసీసీఐపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2011 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ వైజాగ్ స్టేడియానికి మొండిచెయ్యే ఎదురైంది.


Similar News