ICC World Cup 2023: కివీస్ జట్టులో మూడు బలహీనతలు.. క్యాష్ చేసుకుంటే టీమిండియాదే విజయం!
ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన న్యూజిల్యాండ్‌ను ఢీకొట్టేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది.
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలి కాలంలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియాకు పెద్ద తలనొప్పిగా మారిన న్యూజిల్యాండ్‌ను ఢీకొట్టేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది. వరల్డ్ కప్‌లో తొలి సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌తో టీమిండియా ఢీకొట్టబోతున్నది. ఈ క్రమంలో కివీస్‌ను ఓడించి, ఫైనల్‌కు చేరాలంటే టీమిండియా కొన్ని ఛాన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కివీస్ జట్టులోని ఈ మూడు బలహీనతలపై దెబ్బకొట్టాలి.
టాపార్డర్ మీదనే భారం..
టోర్నీ ప్రారంభానికి ముందు కేన్ విలియమ్సన్‌కు గాయం అవడంతో కివీస్ టాపార్డర్ బలంపై అనుమానాలు నెలకొన్నాయి. ఒక్క డెవాన్ కాన్వే తప్ప ఆధారపడదగిన ప్లేయర్ లేడే అని అంతా అనుకున్నారు. అయితే అతను పెద్దగా ఆకట్టుకోలేదు కానీ కొత్త కుర్రాడు రచిన్ రవీంద్ర అద్భుతంగా ఆడుతున్నాడు. రవీంద్ర చెలరేగుతుండగా.. రీఎంట్రీ ఇచ్చిన విలియమ్సన్ అసలు గాయం నుంచి తిరిగొచ్చినట్లే కనిపించడం లేదు. అద్భుతంగా ఆడుతూనే ఉన్నాడు. అయితే కివీస్ మిడిలార్డర్ అంత గొప్పగా ఆడటం లేదు. టామ్ లాథమ్, డారియల్ మిచెల్ స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. కానీ ఫామ్‌లో ఉన్న కుల్దీప్, జడేజా వాళ్లను కట్టడి చేయడం కష్టం కాదు. ఇలా ఒత్తిడి పెంచితే కివీస్ బ్యాటింగ్ తడబడటం ఖాయం. ఇక గ్లెన్ ఫిలిప్స్ విధ్వంసం సృష్టించగలడు. కానీ ఓవర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఇన్నింగ్స్ నిర్మించడం అతని వల్ల కావడం లేదు. అంటే ఈ జట్టు ఎక్కువగా టాపార్డర్ మీదనే ఆధారపడుతోంది. వాళ్లను కట్టడి చేస్తే ఈ మ్యాచులో టీమిండియా విజయావకాశాలు చాలా మెరుగవుతాయి.
స్పిన్నర్ల కొరత..
కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఈ టోర్నీలో అదరగొడుతున్న స్పిన్నర్లలో అతనొకడు. కానీ అతనికి సహకారం అందించే మరో నాణ్యమైన స్పిన్నర్ జట్టులో లేడు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, ఐష్ సోధీ మాత్రమే ఆ టీంకు ఉన్న ఆప్షన్స్. వీరిలో సోధీ ఇప్పటి వరకు ఈ టోర్నీలో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. మిగతా వాళ్లందరూ ఆల్‌రౌండర్లే. రవీంద్ర కేవలం 5 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అయితే బౌలింగ్‌లో ఫిలిప్స్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. కానీ బలమైన టీమిండియా బ్యాటింగ్ లైనప్ ముందు అతను అంత ప్రభావం చూపిస్తాడా? అనేది అనుమానమే. అదే సోధీని జట్టులోకి తీసుకుంటే బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోతుంది. కాబట్టి నాణ్యమైన రెండో స్పిన్నర్ లేని లోటును కూడా టీమిండియా యూజ్ చేసుకోవచ్చు.
సెమీస్‌లో తడబాటు..
నాకౌట్ గేమ్ కావడంతో రెండు జట్ల మీదా ఒత్తిడి సహజమే. ముఖ్యంగా సెమీస్‌లో టీమిండియా ఇటీవలి కాలంలో తడబడటం మనందరికీ తెలిసిందే. అయితే కివీస్ కూడా ఇలాంటి తడబాటును ప్రదర్శిస్తూనే వస్తోంది. ఇప్పటి వరకు 13 వరల్డ్ కప్‌లలో కివీస్ ఇలా సెమీస్ చేరడం ఇది తొమ్మిదోసారి కావడం గమనార్హం. అయితే వీటిలో కేవలం రెండుసార్లు మాత్రమే ఫైనల్ వరకు వెళ్లింది. అలాగే ఇప్పటి వరకు వరల్డ్ కప్‌ను ముద్దాడలేదు కూడా. ఇక వాంఖడేలో టీమిండియా సపోర్టర్ల ముందు ఆడాల్సి రావడం కూడా కివీస్‌పై ఒత్తిడి పెంచుతుంది. ఈ ఒత్తిడిని కనుక టీమిండియా తమ ప్రదర్శనతో మరింత పెంచితే కచ్చితంగా విజయం రోహిత్ సేనదే.