వీళ్లు అదృష్టవంతులు.. అప్పుడు నన్ను టమాటాలు, కుళ్లిన కోడిగుడ్లతో కొట్టారు : పాక్ మాజీ క్రికెటర్
ICC World Cup 2023లో సెమీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాక్ జట్టు.. అంచనాలను తలకిందులు చేస్తూ పేలవ ప్రదర్శన చేసింది.
దిశ, వెబ్‌డెస్క్: ICC World Cup 2023లో సెమీస్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పాక్ జట్టు.. అంచనాలను తలకిందులు చేస్తూ పేలవ ప్రదర్శన చేసింది. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో నాలుగింటిలోనే గెలుపొందింది. దీంతో పాక్ జట్టు ఆటతీరుపై ఆ దేశ క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆగ్రహంతో ఉన్నారు. లీగ్ మ్యాచ్‌లు ముగియడంతో పాక్ ఆటగాళ్లు సోమవారం స్వదేశానికి చేరుకున్నారు. అభిమానులు ఆగ్రహంతో ఆటగాళ్ల ఇళ్లపై దాడి చేసే అవకాశం ఉండటంతో భారీ భద్రత కల్పించారు.
ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ ఆటగాడు అకీబ్ జావెద్ గతంలో తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుత పాక్ టీమ్‌లోని ఆటగాళ్లను అదృష్టవంతులతో పోల్చాడు. గతంలో పోలిస్తే ఇప్పుడు చాలా నయం అని, 1996లో తనపై టమాటాలు, కుళ్లిన కోడిగుడ్లు విసిరారని అకీబ్ జావెద్ పేర్కొన్నాడు. 1996 ప్రపంచకప్‌లో లీగ్ దశలో పాకిస్థాన్ ఐదు మ్యాచ్‌లు ఆడి నాలుగు విజయాలు సాధించింది. బెంగళూరు వేదికగా భారత్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.