CWC Qualifiers 2023: వరల్డ్‌కప్‌ అర్హత దిశగా జింబాబ్వే..

సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది.

Update: 2023-06-29 16:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: సొంతగడ్డపై జరుగుతున్న క్రికెట్‌ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ పోటీలో జింబాబ్వే ఎదురులేకుండా సాగుతోంది. సూపర్‌ సిక్స్‌ పోరులో ఒమన్‌‌తో జరిగిన ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించే విషయంలో మరింత దగ్గరైంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. జింబాబ్వే బ్యాటర్స్‌లో సీన్‌ విలియమ్సన్‌(103 బంతుల్లో 142 పరుగులు, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) టోర్నీలో మూడో శతకంతో చెలరేగాడు. సికందర్‌ రజా (42) పరుగులు చేయగా.. ఆఖర్లో జాంగ్వే 28 బంతుల్లో 43 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఒమన్‌ బౌలర్లలో ఫయాజ్‌ బట్‌ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బరిలోకి దిగిన ఒమన్‌ శక్తికి మించి పోరాటం చేసింది. ఓపెనర్‌ కశ్యప్‌ ప్రజాపతి 97 బంతుల్లోనే 103 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మిడిలార్డర్‌లో అకీబ్‌ ఇల్యాస్‌ (45), జీషన్‌ మక్సూద్‌ (37), ఆయానా ఖాన్‌ (47) పరుగులు చేశాడు. దీంతో ఒమన్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానిక 318 పరుగులకు పరిమితమైంది. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్‌ ముజరబానీ, తెందయి చతారాలు చెరో 3 వికెట్లు తీయగా.. రిచర్డ్‌ నగర్వా 2,సికందర్‌ రజా 1 వికెట్‌ తీశాడు.

ఈ విజయంతో లీగ్‌ దశలో అన్ని మ్యాచ్‌ల్లో విజయాలు సాధించిన జింబాబ్వే 4 పాయింట్లతో సూపర్‌ సిక్స్‌లో రెండో టాపర్‌గా అడుగుపెట్టింది. తాజాగా ఒమన్‌పై విజయంతో పాయింట్ల సంఖ్యను ఆరుకి పెంచుకుంది. మరొక విజయం సాధిస్తే జింబాబ్వే అక్టోబర్‌-నవంబర్‌ నెలల్లో భారత్‌ వేదికగా జరగనున్ను వన్డే వరల్డ్‌కప్‌కు అర్హత సాధిస్తుంది.



Similar News