బ్యాచ్ ఒకటే.. కానీ, ఒకరు సీఐ.. మరొకరు ఎస్సై

దిశ, క్రైమ్ బ్యూరో: పోలీస్ శాఖలో 2009 – ఎస్ఐ బ్యాచ్ కు చెందిన హైదరాబాద్ రేంజ్ అధికారులు ప్రమోషన్ల కోసం నిరీక్షిస్తున్నారు. డిపార్టుమెంట్ లో ఒకే బ్యాచ్ అధికారులు ఒకే స్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ప్రభుత్వ పారదర్శకత లోపంతో వేర్వేరు స్థాయిల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి వస్తోంది. ఒకే పోలీస్ స్టేషన్ లో ఒకే బ్యాచ్ అధికారులు ఒకరు ఉన్నతాధికారిగా, మరొకరు సబార్డినేట్ గా వ్యవహారిస్తున్నారు. ఈ తరహా ఉదాహరణలు హైదరాబాద్ రేంజ్ లో […]

Update: 2020-08-03 21:10 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: పోలీస్ శాఖలో 2009 – ఎస్ఐ బ్యాచ్ కు చెందిన హైదరాబాద్ రేంజ్ అధికారులు ప్రమోషన్ల కోసం నిరీక్షిస్తున్నారు. డిపార్టుమెంట్ లో ఒకే బ్యాచ్ అధికారులు ఒకే స్థాయిలో విధులు నిర్వర్తించాల్సి ఉండగా.. ప్రభుత్వ పారదర్శకత లోపంతో వేర్వేరు స్థాయిల్లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాల్సి వస్తోంది. ఒకే పోలీస్ స్టేషన్ లో ఒకే బ్యాచ్ అధికారులు ఒకరు ఉన్నతాధికారిగా, మరొకరు సబార్డినేట్ గా వ్యవహారిస్తున్నారు. ఈ తరహా ఉదాహరణలు హైదరాబాద్ రేంజ్ లో అనేకం.

రోస్టర్ లేకుండానే ప్రమోషన్లా..?

2009- బ్యాచ్ ఎస్ఐ పోస్టుల నియామకాల్లో హైదరాబాద్ రేంజ్ పరిధిలో హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, నల్గొండ, మహమూబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా 436 పోస్టులను భర్తీ చేశారు. వీరికి 2017లో ఎస్ఐ నుంచి సీఐగా ప్రమోషన్ కల్పించారు. ఇందులో 136 మందికి మాత్రమే సీఐలుగా పదోన్నతులు కల్పించారు. మిగతా 300 మంది ఎస్ఐలకు ప్రమోషన్ రాలేదు. చాలా పోలీస్ స్టేషన్లలో వారి బ్యాచ్ మేట్ వద్దనే మిగతా వారు ఎస్ఐలుగా విధులు చేపడుతూ సెల్యూట్ చేయాల్సి వస్తోంది. మరో వైపు తమకు ప్రమోషన్ రాలేదని ఆత్మ న్యూనతకు లోనవుతున్నారు. ప్రమోషన్లలోనూ డిపార్టుమెంట్​ మార్గదర్శకాలను పాటించలేదనే విమర్శలున్నాయి. ప్రమోషన్లు కల్పించిన 136 మందికి సీరియల్ నెంబరు, రోస్టర్ పాయింట్ అమలు కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా గిరిజన సామాజిక వర్గానికి చెందిన అధికారులే అత్యధికంగా నష్టపోయారని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఓ గిరిజన ఎస్ఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే వరంగల్ రేంజ్ పరిధిలో 2009 ఎస్ఐ బ్యాచ్ అధికారులకు పూర్తి స్థాయిలో ప్రమోషన్లు పొంది.. 2012 బ్యాచ్ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారు.

అమలుకు నోచుకోని సీఎం హామీ..

ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో ఒకే బ్యాచ్ కు చెందిన వారికి ప్రమోషన్లను కూడా ఒకే దఫాలో కల్పించాలని సీఎం కేసీఆర్ పలు మార్లు వ్యాఖ్యనించారు. అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులను క్రియేట్ చేయాలని సీఎం చెప్పారు. కానీ, ఆ మాటలు కార్యరూపం దాల్చడం లేదు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ లలో అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ఓ స్థాయిని ఎస్ఐ నుంచి సీఐ పోస్టుకు అప్ గ్రేడ్ చేయాలని కోరుతున్నారు. దేశంలోని ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో మెట్రో రైల్వే స్టేషన్లలో భద్రతా విషయమై సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారులను నియామకం చేసినట్టుగానే హైదరాబాద్ లోనూ సీఐలకు సెక్యూరిటీ విధులు అప్పగించాలంటున్నారు. బంజారాహిల్స్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి 24 గంటల పాటు రాష్ట్రం అంతటా సెక్యూరిటీ విధులు పర్యవేక్షణకు మూడు షిఫ్టుల్లో సుమారు 60 మంది ఇన్ స్పెక్టర్లు అవసరమవుతారని అంచనా. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు వాస్తవాలను గ్రహించి హైదరాబాద్ రేంజ్ లో ఇన్ స్పెక్టర్ పోస్టులను 2009 బ్యాచ్ లో మిగిలిన వారితో భర్తీ చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News