వడదెబ్బకు ఇరవై మంది మృతి !
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రమంతటా కరోనా భయం ఒకవైపు కొనసాగుతుండగానే గత నాలుగైదు రోజులుగా ఎండలు మండుతుండడంతో సుమారు 20మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ మరణాలను ఇంకా వడదెబ్బ మృతుల జాబితాలో చేర్చలేదని, జిల్లా యంత్రాంగం ద్వారా నివేదిక వస్తే ఆ ప్రకారం ప్రకటన వెలువడుతుందని విపత్తు నిర్వహణ విభాగం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి అందిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో నలుగురు, కరీంనగర్ జిల్లాలో నలుగురు చొప్పున మొత్తం […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రమంతటా కరోనా భయం ఒకవైపు కొనసాగుతుండగానే గత నాలుగైదు రోజులుగా ఎండలు మండుతుండడంతో సుమారు 20మంది వడదెబ్బ కారణంగా మృతి చెందారు. ఈ మరణాలను ఇంకా వడదెబ్బ మృతుల జాబితాలో చేర్చలేదని, జిల్లా యంత్రాంగం ద్వారా నివేదిక వస్తే ఆ ప్రకారం ప్రకటన వెలువడుతుందని విపత్తు నిర్వహణ విభాగం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి అందిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాలో ఇద్దరు, నల్లగొండ జిల్లాలో నలుగురు, కరీంనగర్ జిల్లాలో నలుగురు చొప్పున మొత్తం ఇరవై మంది వడదెబ్బ అనుమానంతో మృతి చెందినట్లు తెలిసిందని పేర్కొన్నారు. అయితే అనధికారికంగా ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉంది. ప్రతీ ఏటా రెవిన్యూ శాఖ పరిధిలోని విపత్తు నిర్వహణ విభాగం హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందిస్తుంది. కానీ ఈ ఏడాది అలాంటిది ఇప్పటికీ రూపొందలేదు.
హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్‌ను రూపొందించడంతో పాటు ప్రజలకు అవగాహన కల్గించేందుకు పోస్టర్లను ముద్రించడం, ప్రచారం చేయడం, వేసవి ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో షెల్టర్లను నెలకొల్పడం లాంటివి జిల్లా యంత్రాంగం చేపట్టాల్సి ఉంటుంది. ఎండను తెలియజేయడానికి వీలుగా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డును నెలకొల్పాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్యలో ఆర్టీసీ బస్సుల్ని తిప్పకుండా ఉండడం, గ్రామీణ ఉపాధి పనులను ఈ నిర్దిష్ట సమయంలో నిర్వహించకుండా చూడడం, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరాలకు తగినంత సంఖ్యలో ఓఆర్ఎస్ (ఓరల్ రీహైడ్రేషన్ సిరప్) ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుకోవడం, వివిధ మాధ్యమాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేయడం.. ఇలా అనేక కార్యక్రమాలను విపత్తు నిర్వహణ విభాగం మరికొన్ని విభాగాల సమన్వయంతో చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది వాటికి ప్రభుత్వం మంగళం పాడింది.
వడదెబ్బకు ఇరవై మంది మృతి !
గడచిన నాలుగైదు రోజులుగా ఎండ వేడి బాగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఇరవై మంది వడదెబ్బ కారణంగా మృతి చెందినట్లు సమాచారం. అయితే ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. వేములవాడ మండలం లింగంపల్లి గ్రామంలో వేణు అనే ఉపాధి హామీ కూలీ, జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామంలో గోపాల్‌గౌడ్ అనే వృద్ధుడు, చొప్పదండి మండలం ఆర్నకొండలో ఉపాధి హామీ కూలీ నర్సవ్వతో పాటు మరొకరు మృతి చెందినట్లు జిల్లా అధికారుల సమాచారం. మూడు రోజుల క్రితం చొప్పదండి ఎమ్మెల్యే సైతం బాధితుల కుటుంబాన్ని పరామర్శించారు. మృతికి వడదెబ్బ కారణమంటూ ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం వారిని వడదెబ్బ మృతులుగా ప్రకటిస్తుంది. రాష్ట్రంలో కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో ఈసారి వేసవి ఎండలు ఎక్కువే ఉన్నాయి. నాలుగైదు రోజులుగా 45 డిగ్రీలకంటే ఎక్కువే నమోదవుతున్నాయి.
విపత్తు నిర్వహణ విభాగం ప్రామాణికాల ప్రకారం 45 సెంటీగ్రేడ్ డిగ్రీల ఎండ దాటితే వడదెబ్బ, 47 డిగ్రీలు దాటితే తీవ్ర వడదెబ్బగా పరిగణించాల్సి ఉంటుంది. కానీ ఈసారి దాదాపు 20 ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటింది. శ్రీరాంపూర్, ధర్మపురి, జగిత్యాల జిల్లా రాజారాంపల్లి తదితర ప్రాంతాల్లో 47 డిగ్రీలు దాటింది. అయినా ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేయలేదు. గతేడాది పాత సచివాలయంలో విపత్తు నిర్వహణ విభాగం ప్రత్యేకంగా ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డు పెట్టింది. నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో సైతం ఇలాంటి బోర్డుల్నే పెట్టింది. కానీ ఈ సంవత్సరం అలాంటి బోర్డులు ఎక్కడా లేవు. కొన్ని ట్రాఫిక్ కూడళ్ళ దగ్గర కోవిడ్ జాగ్రత్తల సూచనలు దర్శనమిస్తున్నాయి.
ఉత్తర తెలంగాణలో పెరిగిన ఎండ
గడచిన నాలుగైదు రోజులుగా ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో 45 సెంటీగ్రేడ్ డిగ్రీల సాధారణ ఉష్ణోగ్రతే నమోదవుతూ ఉంది. ఆదివారం సైతం అదే స్థాయిలో ఎండలు తీవ్రంగా కనిపించాయి. ఆదిలాబాద్ జిల్లా భోరజ్‌లో 46.3 డిగ్రీలు, జన్నారంలో 45.9, కామారెడ్డి జిల్లా కొల్లూరులో 45.9, ఆదిలాబాద్ జిల్లా థాంసీలో 45.8, నిర్మల్ జిల్లా పాత ఎల్లాపూర్‌లో 45.7, ఇదే జిల్లాలోని లింగాపూర్, పెంబి ప్రాంతాల్లో 45.7, జగిత్యాల జిల్లా మేడిపల్లిలో 45.7, ఇదే జిల్లా మద్దుట్లలో 45.7 చొప్పన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నాలుగేళ్ళ క్రితం 2016 ఏప్రిల్ 17న ఆదిలాబాద్‌లో 48.2 డిగ్రీలు, 21.5.2015న టేకులపల్లిలో 48, 30.5.2015న ములుగు ఘనపూర్‌లో 48.9, 21.5.2015న మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 48/9, 22.5.2015న నిర్మల్ జిల్లా పెంబిలో 48.8, 24.5.2015న కోదాడలో 48.6 డిగ్రీల చొప్పున నమోదైంది. 2015న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ తీవ్రతతో ఎండలు మండుతున్నాయి.
హైదరాబాద్ నగరంలో సైతం ఎండ వేడి చాలా ఎక్కువగానే ఉంది. నగరంలో అన్ని ప్రాంతాల్లో సగటున 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గరిష్టంగా బండ్లగూడ, బీహెచ్ఈఎల్ ప్రాంతాల్లో 44.4 డిగ్రీల మేర నమోదైనట్లు రాష్ట్ర ప్లానింగ్ డెవలప్‌మెంట్ సొసైటీ తెలిపింది. ఉత్తర భారతదేశంలో రానున్న వారం రోజుల పాటు తీవ్ర స్థాయిలో ఎండలు ఉంటాయని, వడగాలులు వీస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించినట్లుగానే తెలంగాణలోని మెజారిటీ ప్రాంతాల్లో రానున్న నాలుగైదు రోజుల పాటు వడగాలులు వీస్తాయని ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది.