ఖమ్మంలో '20'.. భద్రాద్రిలో '0'..
దిశ ప్రతినిధి, ఖమ్మం: ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తొలిరోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నామమాత్రపు స్పందన కనిపించింది. దీనికి తోడు మధ్యాహ్నం వేళలో కొన్ని చోట్ల గంట.. మరికొన్ని మండలాల్లో గంటన్నరకు పైగా సర్వర్ ప్రాబ్లం వచ్చింది. ఇదిలా ఉండగా ధరణి పాస్ బుక్ ప్రింట్ తీసి ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో జనాలు అసహనానికి గురయ్యారు. సోమవారం ఖమ్మం జిల్లాలోని కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో 6, పెనుబల్లిలో 4, ఖమ్మం రూరల్ 2, […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తొలిరోజు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నామమాత్రపు స్పందన కనిపించింది. దీనికి తోడు మధ్యాహ్నం వేళలో కొన్ని చోట్ల గంట.. మరికొన్ని మండలాల్లో గంటన్నరకు పైగా సర్వర్ ప్రాబ్లం వచ్చింది. ఇదిలా ఉండగా ధరణి పాస్ బుక్ ప్రింట్ తీసి ఇవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుండటంతో జనాలు అసహనానికి గురయ్యారు.
సోమవారం ఖమ్మం జిల్లాలోని కల్లూరు తహసీల్దార్ కార్యాలయంలో 6, పెనుబల్లిలో 4, ఖమ్మం రూరల్ 2, రఘునాథపాలెంలో 3, కూసుమంచిలో 1, చింతకాని లో 1, తల్లాడలో 2, మధిరలో 1 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రిజిస్ట్రేషన్లేవీ జరగలేదు. అయితే నాలుగు స్లాట్లు బుక్ అయినట్లు కలెక్టర్ డా.ఎంవీ.రెడ్డి తెలిపారు. మొదటి స్లాట్ దమ్మపేట మండలంలో కాగా రెండోది అశ్వారావుపేట మండలంలో, మరో రెండు బూర్గంపాడు మండలంలో జరిగాయని తెలిపారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు స్లాట్ బుక్ చేసుకున్న క్రయ, విక్రయదారులకు ఇచ్చిన తేదీ, సమయం ప్రకారం సంబంధిత తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాలని ఆయన చెప్పారు.
స్లాట్ తక్కువే.. అయినా కార్యాలయాల్లో హడావుడి..
ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియకు తొలిరోజు కావడంతో తహసీల్దార్ కార్యాలయాల వద్ద హడావుడి కనిపించింది. అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమై కనిపించారు. అయితే భూ కొనుగోలు చేసిన వారికి అవగాహన లేకపోవడంతో ధరణి వెబ్‌సైట్ లో స్లాట్ బుకింగ్స్ చాలా చోట్ల మిగిలాయి. ఖమ్మం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఒక్క స్లాట్ కూడా బుక్ కాకపోవడం గమనార్హం. ఆరేడు మండలాలు మినహా మిగతా మండలాల్లో స్పందన లేదు. అయితే రెండు, మూడు రోజుల్లో స్లాట్ బుకింగ్ లు పెరుగుతాయని అధికారులు చెబుతున్నారు. స్లాట్ బుకింగ్, పోర్టల్ పనితీరు వంటి అంశాలపై జనాలు తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది వద్ద ఆరా తీయడం కనిపించింది.