120 కిలోల గంజాయి పట్టివేత : డీఐజీ రంగనాథ్
దిశ, నల్లగొండ: గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి – 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఒక ఆర్టీసీ బస్సులో 20 కిలోలు, కారులో 100 కిలోల గంజాయి మొత్తం 120 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న […]
దిశ, నల్లగొండ: గంజాయి అక్రమ రవాణాపై పటిష్ట నిఘా పెట్టడం ద్వారా జిల్లా పరిధిలో జాతీయ రహదారిపై 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ ఏవీ రంగనాథ్ తెలిపారు. నల్లగొండ జిల్లా పరిధిలోని జాతీయ రహదారి – 65పై నిరంతరాయంగా నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల్లో ఒక ఆర్టీసీ బస్సులో 20 కిలోలు, కారులో 100 కిలోల గంజాయి మొత్తం 120 కిలోల గంజాయిని సోమవారం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా రూటు మార్చి ప్రైవేట్ వాహనాలలో కాకుండా ఆర్టీసీ బస్సులలో మహిళలతో కలిసి ప్రయాణికుల ముసుగులో గంజాయిని తరలిస్తున్నారని వెల్లడించారు. తాజాగా జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా భద్రాచలం డిపోకు చెందిన రాజధాని డీలక్స్ బస్సును కట్టంగూర్ – నల్లగొండ క్రాస్ రోడ్డు వద్ద తనిఖీ నిర్వహించగా ఒరిస్సాకు చెందిన మహిళ సుమిత్ర సర్కార్, ఇద్దరు పురుషులు సుజిత్ బిస్వాస్, అమల్ పొద్దార్ భద్రాచలం మీదుగా 20 కిలోల గంజాయితో హైదరాబాద్‌కు తరలిస్తూ పట్టుపడినట్లు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు వ్యక్తులకు సంబంధం ఉన్నట్లుగా విచారణలో తేలింది, వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన తెలిపారు.
జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న తనిఖీలు మొత్తం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే జరిగిందని చెప్పారు. సామాజిక మాధ్యమాలు, కొన్ని మీడియాలలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే కుమారుడిని కట్టంగూర్ వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీ చేసి, గంజాయి కేసులో అదుపులోకి తీసుకొని విడిచిపెట్టినట్లుగా అసత్య ప్రచారాలు వస్తున్నాయని, అవన్నీ అవాస్తవమని ఆయన స్పష్టం చేశారు. అనుమానాలు ఉంటే సీసీ ఫుటేజ్ చూపిస్తామని అన్నారు. నల్లగొండ జిల్లాను గంజాయి రహిత జిల్లాగా మార్చడమే తమ లక్ష్యం అని అన్నారు. గంజాయి మత్తుకు బానిసలై బంగారు భవిష్యత్తును యువత నాశకోవద్దు అంటూ సూచించారు. ఈ రెండు కేసులను నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి నేతృత్వంలో సమర్ధవంతంగా పనిచేసిన శాలి గౌరారం సీఐ ప్రసాద్, నకిరేకల్ సీఐ నాగరాజు, కట్టంగూర్ ఎస్ఐ శివ ప్రసాద్, పోలీస్ సిబ్బందిని డీఐజీ రంగనాథ్ ప్రత్యేకంగా అభినందించారు.