ఏపీ ప్రజలకు శుభవార్త.. త్వరలో..
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు కొత్తగా 12 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను మొత్తం 25 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న అతి ముఖ్యమైన పథకంపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. సచివాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ […]
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడున్న 13 జిల్లాలకు తోడు కొత్తగా 12 జిల్లాలు ఏర్పడబోతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను మొత్తం 25 జిల్లాలుగా విభజించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న అతి ముఖ్యమైన పథకంపై అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. సచివాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చుదామని సీఎం పేర్కొన్నారు.
ఎట్టకేలకు క్లారిటీ..
అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్రలోనే సుపరిపాలన కోసం ఏపీని 25 జిల్లాలుగా విభజిస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన తర్వాత కొత్త జిల్లాలపై ఊసెత్తలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఉంటుందని అంతా భావించినా.. ఆ దిశగా కదలిక రాలేదు. ఈ అంశంపై తాను సీరియస్‌గానే ఆలోచిస్తున్నట్లు మంగళవారం నిర్వహించిన కాన్ఫరెన్స్‌లో సీఎం క్లారిటీ ఇచ్చారు. జిల్లా విభజనపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశాలున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి.
వైఎస్సార్ జయంతి నాడు..
రాష్ట్రంలో అర్హులందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ చేయడమనేది అతి ముఖ్యమైన, అతిపెద్ద కార్యక్రమమని, ఇప్పటిదాకా జాబితాలో ఉన్న 30 లక్షల మంది లబ్ధిదారులకూ జూలై 8న ఒకే రోజు ఇళ్ల పట్టాలు అందజేయాలని సీఎం జగన్ కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి జిల్లాల వారీగా రివ్యూ నిర్వహించారు. జులై 8న జగన్ తండ్రి, దివంగత సీఎం వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది.
ఓటేయకున్నా ఇచ్చేయండి..
‘‘ఇళ్ల పట్టాల పంపిణీని ముఖ్య కార్యక్రమంగా నేను భావిస్తున్నా. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధి తదితర అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించాలి. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత నేను గ్రామాల పర్యటనకు వస్తా. అప్పుడు ఇళ్ల పట్టాలు లేవని ఏ ఒక్కరూ అనే పరిస్థితి ఉండకూడదు. ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి లాటరీ ప్రక్రియను వెంటనే పూర్తి చేయండి. లబ్ధిదారుల తుది జాబితాను అన్ని గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. నాకు ఓటేయకున్నా, వేసినా.. అర్హత ఉన్న అందరికీ ఇళ్ల పట్టాలు అందాల్సిందే”అని సీఎం వ్యాఖ్యానించారు.