ఎటూ తేలని ఉద్యోగ ఖాళీలు.. మిస్టరీగా 1.35 లక్షల జాబ్స్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల లెక్కలపై గందరగోళం నెలకొంది. ఈ లెక్కలపై అటు ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగులకు స్పష్టత రావడం లేదు. మొత్తం ఖాళీలను చూపించినట్లు సీఎస్నివేదిక చెప్పుతుండగా.. ఖాళీ పోస్టులను ఎక్కడా చూపించడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు అన్ని శాఖలను అధ్యయనం చేసి, అధికారికంగా వివరాలు తీసుకున్న తెలంగాణ తొలి వేతన సవరణ నివేదికలో ఖాళీలపై ఒక సంఖ్య చెప్పితే… సీఎస్ఆధ్వర్యంలో దాదాపు 26 శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటైన […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల లెక్కలపై గందరగోళం నెలకొంది. ఈ లెక్కలపై అటు ఉద్యోగులకు, ఇటు నిరుద్యోగులకు స్పష్టత రావడం లేదు. మొత్తం ఖాళీలను చూపించినట్లు సీఎస్నివేదిక చెప్పుతుండగా.. ఖాళీ పోస్టులను ఎక్కడా చూపించడం లేదనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మరోవైపు అన్ని శాఖలను అధ్యయనం చేసి, అధికారికంగా వివరాలు తీసుకున్న తెలంగాణ తొలి వేతన సవరణ నివేదికలో ఖాళీలపై ఒక సంఖ్య చెప్పితే… సీఎస్ఆధ్వర్యంలో దాదాపు 26 శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటైన సమావేశంలో మరో సంఖ్య ఇచ్చారు. పీఆర్సీకి తప్పుడు నివేదికలు ఇచ్చారా… లేకుంటే ఇప్పుడు హడావుడిగా తేల్చకుండానే ఖాళీల నివేదికలు ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ సర్కారు లెక్క
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీల లెక్క తేలింది. 28 ప్రభుత్వ శాఖల్లో 56,979 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. బుధవారం జరిగిన కేబినెట్భేటీలో ఉద్యోగ ఖాళీల వివరాలను వెల్లడించారు. ప్రభుత్వం వెల్లడించిన నివేదికలో 56,979 ఖాళీలను చూపించారు. ఇందులో ప్రభుత్వ శాఖల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు 44,022 ఉండగా… ఇనిస్టిట్యూషన్స్‌లో 12,957 ఉన్నాయి. మొత్తం 56,979 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అవకాశం ఉన్నట్లు సీఎస్… సీఎం కేసీఆర్‌కు నివేదిక అందించారు.
ఇక పోలీస్ శాఖలోనే ఎక్కువ ఖాళీలున్నట్లు నివేదికల్లో వెల్లడించారు. పోలీస్ శాఖలో 21,507 పోస్టులు భర్తీ చేయాల్సి ఉన్నట్లు నివేదించారు. ఆ తర్వాత వైద్యారోగ్య శాఖలో 10,048 పోస్టులు, ఉన్నత విద్యాశాఖలో 3,825 పోస్టులు, బీసీ వెల్ఫేర్‌లో 3,538 పోస్టులు, ఎస్సీ వెల్ఫేర్‌లో 1967, రెవెన్యూ విభాగంలో 1700 పోస్టులు భర్తీ చేయాలని నివేదికల్లో వెల్లడించారు. అత్యల్పంగా ఐటీ విభాగంలో నాలుగు పోస్టులను భర్తీ చేయాల్సి ఉన్నట్లు తేల్చారు.
పీఆర్సీ లెక్క 1.91 లక్షలు
ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఏండ్ల నుంచి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తే కొంత మేరకే ఖాళీలు చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఖాళీల వ్యత్యాసంపై విపక్షాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పీఆర్సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో లక్షా 91 వేల 126 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అన్ని డిపార్ట్ మెంట్లలో కలిపి మొత్తం 4, 91, 304 శాంక్షన్డ్ పోస్టులు ఉండగా, ప్రస్తుతం 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారని పీఆర్సీ తన రిపోర్టులో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం మొత్తం మంజూరైన పోస్టుల్లో 39 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని వెల్లడించారు.
ఎక్కడ చూపించారు
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలు ఎలా మాయమయ్యాయనేది ఇప్పుడు నిరుద్యోగులతో పాటు రాష్ట్రంలోని విపక్షాలను వేధిస్తున్న ప్రశ్న. పీఆర్సీ సూచించిన లెక్కల ప్రకారం రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో 1,91,126 ఖాళీలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వ నివేదికలో మాత్రం 56,979 ఖాళీలను చూపించారు. ఇంకా 1,34,147 ఉద్యోగాలపై తేల్చడం లేదు. ఒకవేళ ఇవన్నీ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్దతిలో భర్తీ చేశారనుకున్నా… ఈ కేటగిరిలో 1.20 లక్షల మంది పని చేస్తున్నట్లు నివేదికల్లోనే తేల్చారు. దీని ప్రకారం వీరు చేస్తున్న పోస్టులను భర్తీ చేసినట్లుగానే చూపించారు. ఒకవేళ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్పద్దతిలో పని చేస్తున్న వారిని కాదని, ఈ పోస్టులను కూడా ఖాళీలుగా చూపిస్తే ఆ సంఖ్య మూడు లక్షలు దాటుతుందంటున్నారు.
పీఆర్సీ నివేదిక ఆధారంగా రాష్ట్రంలోని ఇనిస్టిట్యూషన్స్‌లో కాకుండా ప్రభుత్వ శాఖల్లో 39 శాతం ఖాళీల్లో 1,08,528 మందిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయిస్తున్నారనే అంచనా కూడా వేశారు. ఒకవేళ ఈ పోస్టులను పక్కన పెట్టినా ఇంకా 16.81 శాతం పోస్టులు ఖాళీగానే ఉన్నాయని స్పష్టమవుతూనే ఉంది.
రెండోసారి సర్కారులో ఇదే తొలిసారి
తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఒక్క ఉద్యోగ ప్రకటన కూడా రాలేదు. దీంతో ఈ నోటిఫికేషన్లు వస్తే ఇదే ప్రథమం కానుంది. రాష్ట్రంలో గ్రూప్–1, గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. వీటిపై నిరుద్యోగులు బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటి వరకు కొత్త జోనల్ విధానంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఈ ఉద్యోగాలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ ఇవ్వలేకపోతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు గ్రూప్–1 ఉద్యోగాల ప్రకటనే రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా 2011లో గ్రూప్–1 నోటిఫికేషన్ వచ్చింది. ఈసారి గ్రూప్–1లో దాదాపు 400 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం ఉందంటున్నారు. అదే విధంగా గ్రూప్–2లో 570కిపైగా పోస్టులు, గ్రూప్–3 కింద 1800 పోస్టులు, గ్రూప్ –4లో రెండున్నర వేలు ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే 2018లో గ్రూప్–3 కింద ఎక్కువ పోస్టులు ఉన్నప్పటికీ… టీఎస్పీఎస్సీ దగ్గర క్లియరెన్స్వచ్చినవి దాదాపు 400 వరకు మాత్రమే ఉన్నాయి.
3 లక్షల ఖాళీలున్నాయి : టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం
రాష్ట్రంలో 3లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పీఆర్సీ నివేదికలో 1.91 లక్షల ఖాళీలు చూపించారు. కానీ ప్రభుత్వం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఆ కార్యాలయాల్లో ఒకరిద్దరితోనే పనులు సాగిస్తున్నారు. అలాంటి ఖాళీలను గుర్తించడం లేదు. విద్యాసంస్థల్లో చాలా ఖాళీ ఉన్నాయి. ఇవన్నీ కలిపితే రాష్ట్రంలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పుతున్న జాబ్ కేలండర్‌కు చట్టబద్దత కల్పించాలి. అప్పుడే నమ్మకం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే చనిపోతే, రాజీనామా చేస్తే ఆరు నెలల్లో ఎన్నికలు పెట్టినట్లు ప్రతి ఏటా జాబ్కేలండర్ప్రకారం ఉద్యోగాలను భర్తీ చేయాలి.
నిరుద్యోగ సమస్యపై చర్చించలేదు : దాసోజు శ్రవణ్
రాష్ట్ర కేబినెట్లో ఏదో హడావుడి చేస్తున్నారు కానీ నిరుద్యోగ సమస్యపై చర్చించలేదు. ఏడేళ్లలో ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఎందుకివ్వడం లేదని టీఆర్‌ఎస్ నేతలను గల్లా పట్టుకొని నిలదీయాలి. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33 కి పెంచినా ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నా కనికరం లేదు. ప్రైవేట్‌లో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చామంటూ కేటీఆర్ అబద్దాలు చెప్పుతున్నాడు.
ప్రభుత్వ ఖాళీలు ఇవి ( సీఎస్ నివేదిక ప్రకారం.. | ఇనిస్టిట్యూషన్లతో కలుపుకుని) |
శాఖ | ఖాళీలు |
పోలీస్ | 21507 |
వైద్యారోగ్యం | 10048 |
ఉన్నత విద్య | 3825 |
బీసీ వెల్ఫేర్ | 3538 |
ఎస్సీ వెల్ఫేర్ | 1967 |
ట్రైబల్ వెల్ఫేర్ | 1700 |
రెవెన్యూ | 1441 |
మైనార్టీ వెల్ఫేర్ | 1437 |
పంచాయతీరాజ్ | 1391 |
సెకండరీ విద్య | 1384 |
నీటిపారుదల శాఖ | 1222 |
మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ | 1148 |
ఫారెస్ట్ | 1096 |
లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ | 980 |
ఫైనాన్స్ | 838 |
మహిళా, శిశు సంక్షేమం | 800 |
వ్యవసాయ శాఖ | 742 |
పశుసంవర్థక శాఖ | 628 |
రవాణా, ఆర్అండ్బీ | 492 |
ఇండస్ట్రీస్ | 292 |
జీఏడీ | 220 |
టూరిజం, కల్చర్, యూత్ | 69 |
ప్లానింగ్ | 65 |
సివిల్ సప్లయి | 48 |
అసెంబ్లీ | 38 |
ఎనర్జీ | 33 |
లా | 26 |
ఐటీ | 4 |
పీఆర్సీ నివేదిక ప్రకారం పలు శాఖల్లో ఖాళీలు | |
స్కూల్ఎడ్యుకేషన్ | 23798 |
పోలీస్ | 37182 |
వైద్యారోగ్యం | 30570 |
రెవెన్యూ | 7961 |
పంచాయతీరాజ్ | 12628 |
నోట్ : మొత్తం ఈ ఐదు శాఖల్లో కలిపి 3,42,938 పోస్టులుండగా, 2,30,799 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. రాష్ట్రంలోని మొత్తం శాంక్షన్డ్ పోస్టుల్లో 69.80 శాతం ఈ ఐదు విభాగాల్లో ఉండగా, మొత్తం ఉద్యోగుల్లో 76.88 శాతం మంది ఉన్నారు.)