ఓ వైపు అల్లర్లు.. మరోవైపు ట్రంప్ సందడి

by Shamantha N |   ( Updated:2020-02-25 03:50:04.0  )
ఓ వైపు అల్లర్లు.. మరోవైపు ట్రంప్ సందడి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఢిల్లీ గురించి టీవీ తెరల్లో భిన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు సొగసైన కార్లు.. ఆహ్లాదకరమైన రోడ్లు.. మరోవైపు కాలిపోతున్న వాహనాలు, ఇండ్లు, రోడ్లపై ఇటుకలు, చెల్లాచెదురుగా పడి ఉన్న రాళ్ల దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు పర్యటన హుందాగా, క్రమపద్ధతిగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం సాగిపోతుండగా.. మరోవైపు సీఏఏ అనుకూలురు, వ్యతిరేకుల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఉద్రిక్త వాతావరణం దర్శనమిస్తున్నది.

యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం.. సోమవారం ఢిల్లీకి చేరే కొన్ని గంటల ముందు ఢిల్లీలో ఘర్షణలు హింసాత్మకమయ్యాయి. అహ్మదాబాద్‌లో సోమవారం ఘనస్వాగతంతో పర్యటన ప్రారంభించిన ట్రంప్.. సబర్మతీ ఆశ్రమం, మొతెరా స్టేడియంలో ‘నమస్తే ట్రంప్’ ఈవెంట్, తాజ్‌మహల్ సందర్శన, రాష్ట్రపతి భవన్ దగ్గర అధికారిక స్వాగతాన్ని స్వీకరించి అటుతర్వాత ద్వైపాక్షిక సమావేశాల్లో పాల్గొన్నారు. మరోవైపు ట్రంప్ ఢిల్లీకి చేరిన సోమవారం ఉదయమే నార్త్ ఢిల్లీ జిల్లాలో ఘర్షణలు హింసాత్మకమయ్యాయి. సోమవారం ఉదయమే సీఏఏ వ్యతిరేకులు, అనుకూలురుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆ అల్లర్లను ఆపేందుకు ఢిల్లీ పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. తర్వాత మంగళవారం ఉదయమూ ఈ అల్లర్లు జరిగాయి. జాఫ్రాబాద్‌లో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనకు సమీపంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, చాంద్‌బాగ్, మౌజ్‌పూర్, భజన్‌పురా, కర్దంపురి, గోకుల్‌పురి, ఖజురి, కరవాల్ నగర్‌లు సహా పలుప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. ఈ అల్లర్లల్లో సుమారు 24 గంటల కాలంలో ఒక పోలీసుసహా ఏడుగురు మరణించారు. 48 మంది పోలీసు అధికారులు ఆస్పత్రిలో చేరారు. సుమారు వందమంది నిరసనకారులూ చికిత్స పొందుతున్నారు.

ఒకవైపు ఢిల్లీలో హింస.. మరోవైపు సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ట్రంప్ పర్యటన ఈ పర్యటనకు సీఏఏ నిరసన సెగలు తాకితే దేశం కాదు.. ప్రపంచవ్యాప్తంగా సీఏఏపై సర్కారు వైఖరికి వ్యతిరేకంగా చర్చ జరిగే అవకాశముంది. అదీగాక, భారతదేశ ప్రతిష్టకు ముప్పువాటిల్లే ప్రమాదముంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఏఏపై హింసను అదుపులోకి తీసుకునేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. సోమవారం రాత్రి హోంశాఖ కార్యదర్శి, ఢిల్లీ పోలీసు అధికారులతో చర్చలు జరిపారు. మంగళవారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతినిధులుసహా అధికారులతో సమావేశమయ్యారు. ఈశాన్య ఢిల్లీ మొత్తం నెలరోజులపాటు 144 విధిస్తున్నట్టు అధికారులు తెలిపారు. బహుశా అమెరికా అధ్యక్షుడు ఇలా పర్యటనలో ఉండగా.. పర్యటనాస్థలానికి సమీపంలో సర్కారు నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంతటి ప్రదర్శనలు, హింస చెలరేగడం, అటువంటి ప్రాంతాల్లో నెలరోజులపాటు 144 సెక్షన్ విధించడం ఇదే మొదటిసారేమోనని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story