భయంలేదు.. అభయమిస్తున్నాం.. ఆస్ట్రాజెనెకాపై ప్రపంచ దేశాలకు WHO హామీ

by vinod kumar |
AstraZeneca vaccine
X

దిశ, వెబ్‌డెస్క్: జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్‌తో సహా ఇతర యూరోపియన్ దేశాలు కరోనా వ్యాక్సిన్ ఆస్ట్రాజెనెకా వాడకాన్ని నిలిపివేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) స్పందించింది. టీకా భద్రతపై భయపడాల్సిందేమీ లేదని ఆ దేశాలకు హామీనిచ్చింది. యూరప్‌లోని పలు దేశాలలో ఆస్ట్రాజెనెకా టీకా వేయించుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం, ప్లేట్‌లెట్స్ తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తుండటంతో జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు టీకా వాడకాన్ని నిలిపేశాయి. తాజాగా స్పెయిన్, పోర్చుగల్, స్లోవేనియా, లాట్వియా దేశాలు కూడా తమ దేశాలలో వ్యాక్సిన్‌ వినియోగాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశాయి. పలు యూరప్ దేశాలతో పాటు ఆసియా దేశాలైన ఇండోనేషియా, థాయ్‌లాండ్ వంటివి కూడా ఇదే బాటలో పయనిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో పై విధంగా స్పందించింది.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో చీఫ్ సైంటిస్టు సౌమ్య స్వామినాథన్ మాట్లాడుతూ.. ‘ప్రజలు ఆందోళన చెందకూడదని మేము కోరుకుంటున్నాం. కొవిడ్-19 ను నివారించడంలో ఆస్ట్రాజెనెకా సమర్థవంతంగా పనిచేస్తున్నది. ఆస్ట్రాజెనెకా టీకా వాడకాన్ని దేశాలు కొనసాగించాలని మేము సిఫారసు చేస్తున్నాం’ అని తెలిపారు. రక్తం గడ్డ కట్టడానికి వ్యాక్సిన్ తీసుకోవడమే కారణమని ఇంతవరకు ఒక్క ఆధారం కూడా లభించలేదని ఆమె అన్నారు.

యూరప్ దేశాల ఆరోపణల నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా భద్రతపై చర్చించేందుకు మంగళవారం డబ్ల్యూహెచ్‌వో నిపుణుల కమిటీ సమావేశం కానుంది. వ్యాక్సిన్ భద్రతపై ఈ కమిటీ చర్చించనుంది.

Advertisement

Next Story

Most Viewed