కరీంనగర్ ప్రాజెక్టుల్లో జలకళ

by Sridhar Babu |
కరీంనగర్ ప్రాజెక్టుల్లో జలకళ
X

దిశ, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లలో నీటి మట్టం భారీగా పెరిగిపోయింది. ప్రాజెక్టుల్లో వరద నీరు వచ్చి చేరుతుండడంతో నిండు కుండలా మారుతున్నాయి. దీంతో ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తు దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు.

కాళేశ్వరం నుండి నీటిని లిఫ్ట్ చేసి రిజర్వాయర్లను నింపాల్సి వస్తుందని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాజెక్టులకు భారీ ఊరట నిచ్చింది. అల్పపీడనం రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని తగ్గించిందని కూడా చెప్పక తప్పుదు.

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సమీపంలోని అప్పర్ మానేరు ప్రాజెక్టుకు కూడవెళ్లి, పాల్వంచ వాగుల నుండి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో నిన్నమొన్నటి వరకు నీరు లేక బోసిపోయిన ఈ ప్రాజెక్టులోకి 2 టీఎంసీల నీటి మట్టం చేరుకుంది. అటు తిప్పాపూర్ సర్జిపూల్ నుండి కూడా నీటిని ఎత్తిపోసే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ సర్జిపూల్ నుండి 8,600 క్యూసెక్కుల నీటిని అనంతగిరికి తరలిస్తున్నారు. 25 టీఎంసీల సామర్థ్యం ఉన్న మిడ్ మానేరు ప్రాజెక్టులో 21.42 టీఎంసీల నీరు వచ్చి చేరగా, 2290 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లోగా వస్తోంది.

కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్‌కు కూడా అనూహ్యంగా వరద నీరు వచ్చి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా సిద్దిపేట జిల్లా మీదుగా ప్రవహించే మోయ తుమ్మెద వాగులో వరద ఉప్పొంగింది. మరో వైపున మానేరు నది ద్వారా క్యాచ్ మెంట్ ఏరియా నుండి కూడా వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికీ రోజుకు దాదాపు ఒక టీఎంసీ చొప్పున నీరు వరద రూపంలో ఈ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో 24 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఎల్‌ఎండీలో 20 టీఎంసీల నీటి మట్టం పెరిగింది.

పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా ఫ్లడ్ కొనసాగుతూనే ఉంది. కడెం ప్రాజెక్టుతో పాటు మంచిర్యాల జిల్లాలోని వాగులు, వంకల నుండి కూడా ఇన్ ఫ్లో వస్తోంది. 20 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి ఇప్పటికే 19 టీఎంసీల నీరు చేరింది. 40 వేల క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా 39 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు 8.83 టీఎంసీల సామర్థ్యం ఉన్న సుందిళ్ల బ్యారేజ్‌కి దాదాపు 41 క్యూసెక్కుల వరద నీరు ఎగువ నుండి వస్తుండగా అంతే మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం సరస్వతి బ్యారేజ్‌కి 3.58 టీఎంసీల నీరు చేరింది. 10.87 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి రిజర్వాయర్, సెందిళ్ల బ్యారేజ్ లతో పాటు మానేరు నది నుండి లక్ష క్యూసెక్కుల వరద నీరు ఇన్ ఫ్లోగా వస్తుండగా అంతే మొత్తంలో నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సామర్థ్యం 16.17 టీఎంసీలు ఉండగా.. ప్రస్తుతం 4.445 టీఎంసీల నీటిని నిలువ ఉంచారు. ఈ బ్యారేజ్‌‌కి కూడా వరద ఉధృతి తీవ్రంగానే కొనసాగుతోంది. అన్నారం బ్యారేజ్‌తో పాటు ప్రాణహిత నది నుండి ఇక్కడి 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుండడంతో 5 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాజెక్టుల్లో నీరు వచ్చి చేరడంతో అధికారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed