నేడు దేశ వ్యాప్తంగా డ్రైరన్.. వ్యాక్సిన్ పంపిణీయే ఆలస్యం

by Anukaran |   ( Updated:2021-01-01 22:23:28.0  )
నేడు దేశ వ్యాప్తంగా డ్రైరన్.. వ్యాక్సిన్ పంపిణీయే ఆలస్యం
X

దిశ, వెబ్ డెస్క్ : నేడు దేశవ్యాప్తంగా అన్నీ రాష్ట్రాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ జరగనుంది. ఈ డ్రై రన్ అనంతరం దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే భారత్ కు చెందిన ప్రముఖ ఫార్మా దిగ్గజం సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా రూపొందించిన కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ ను అత్యవసర వినియోగం కింద వినియోగించుకునేందుకు కేంద్రం వ్యాక్సిన్ నిపుణుల కమిటీ అనుమతి నిచ్చింది. ఈ అనుమతితో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 5 కోట్ల వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పింది. అయితే అంతకంటే ముందు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంది. డీజీసీఐ అనుమతి ఇచ్చిన రెండు రోజుల్లోనే దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ చేస్తామని సీరమ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా తెలిపారు.

కాగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కోసం కేంద్రం గతేడాది డిసెంబర్ 28, 29న అస్సాం, ఆంధ్రప్రదేశ్, పంజాబ్ తో పాటు గుజరాత్‌లో డ్రైరన్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఇవాళ దేశవ్యాప్తంగా డ్రైరన్‌ను నిర్వహించనుంది కేంద్రం. ఇందుకోసం కేంద్రం భారీ ఎత్తున కసరత్తు చేసింది. ఆ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

♦ దేశవ్యాప్తంగా నిర్వహించే డ్రై రన్ కోసం కేంద్రం సర్వం సిద్ధం చేసింది. ఇందుకోసం సుమారు 96,000 వ్యాక్సినర్లకు శిక్షణ ఇచ్చినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 2,360 మందికి జాతీయ స్థాయిలో శిక్షణ పొందగా 57,000 మందికి పైగా 719 జిల్లాల్లో జిల్లా స్థాయిలో శిక్షణ పొందారు.

♦ ప్రతీ ప్రాంతంలో నిర్వహించే ఈ డ్రైరన్ లో సుమారు 25మంది వాలంటీర్లను డమ్మీ టీకాల్ని అందిస్తారు. అదే సమయంలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే అంశాన్ని నిర్ధారిస్తారు. పూర్తి స్థాయిలో కరోనావ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎలాంటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

♦ టీకాలు వేసే ప్రాంతాల్లో వాలంటీర్లు బాధ్యతలు నిర్వహించనున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ తయారుచేసిన చెక్‌లిస్ట్ ఆధారంగా వ్యాక్సినేషన్ విధానాన్ని అనుసరిస్తారని, ఈవిధానం అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

♦ దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందాలంటే ఈ డ్రైరన్ చాలా కీలకం. పరస్పర అవగాహన, సమన్వయం వల్ల త్వరలో దేశంలో అందించే వ్యాక్సిన్ లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్ చెప్పినట్లు ప్రముఖ మీడియా సంస్థ పీటీఐ నివేదించింది.

♦ దేశ రాజధాని ఢిల్లీ షాదార్‌లోని గురు తేగ్ బహదూర్ హాస్పిటల్, దర్యాగంజ్‌‌లోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఢిల్లీ ద్వారాకనగర్ వెంకటేశ్వర్ ఆసుపత్రిలో నిర్వహించే డ్రైరన్‌ను హర్షవర్ధన్ పర్యవేక్షించనున్నారు.

♦ లక్నోలో ఆరు చోట్ల డ్రై రన్ జరుగుతుంది. పూణేలో నాగ్‌పూర్, జల్నా, నందూర్‌బార్ మినహా మూడు ఆరోగ్య కేంద్రాలలో జరగనుంది. ఛత్తీస్‌గఢ్ లోని ఏడు జిల్లాలు, గుజరాత్‌లోని నాలుగు జిల్లాలు, పంజాబ్ పాటియాలా , హర్యానా పంచకులా, కేరళలో తిరువనంతపురం, ఇడుక్కి, వయనాడ్ మరియు పాలక్కాడ్ జిల్లాల్లో డ్రై రన్ జరగనుంది.

♦ వ్యాక్సిన్ ఖర్చు ఎంత? దాన్ని ఎవరు చెల్లిస్తారనే అంశంపై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ ప్రస్తుతం, టీకా ఖర్చును కేంద్రప్రభుత్వమే అందిస్తుందన్నారు. అయితే కరోనా వ్యాక్సిన్ ను అరికట్టేందుకు రెండో డోసులు అవసరం. ఒక్క డోసు ఇచ్చిన 4 వారాల తరువాత రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది. సీరమ్ ఇండియా తయారు చేసిన వ్యాక్సిన్ ఒక్కోడోస్ ఖరీదు రూ.225 నుంచి రూ.240వరకు ఉంటుందని, కేంద్ర ప్రభుత్వం సీరమ్ కు సుమారు రూ.400పైగా చెల్లించనుందని సమాచారం. కాగా సీరమ్ తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ ను భారత్ లో రూ.400కే ఇస్తుంటే ఇతర దేశాల్లో వ్యాక్సిన్ ఖరీదు రూ.700 నుంచి రూ.800 వరకు ఉందని తెలుస్తోంది.

Advertisement

Next Story