- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆమెపైనే అందరి కళ్లు.. ఆశగా ఎదురుచూపులు…
దిశ, తెలంగాణ బ్యూరో : వైఎస్ షర్మిల ఇటీవల పార్టీ పెడతానని ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రోజూ లోటస్ పాండ్ కు వెళ్లే వైఎస్ అభిమానులతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. నిత్యం పలు జిల్లాల నాయకులు షర్మిల అపాయింట్ మెంట్ తీసుకుంటున్నారు. ఆమెను కలిసి తమ ప్రాంత సమస్యలను వివరిస్తున్నారు. ఇతర పార్టీల్లో సముచిత స్థానం లభించని నేతలతో పాటు పలు కుల సంఘాల నాయకులు షర్మిలను కలిసి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు.
లోటస్ పాండ్ కళకళ..
కొద్ది రోజుల కిందటి వరకు వెలవెలబోయిన లోటస్ పాండ్ షర్మిల కొత్త పార్టీ ప్రస్తావనతో వైఎస్ అభిమానులు, పలు పార్టీల నేతలు, పలు సంఘాల నాయకులతో కళకళలాడుతోంది. వచ్చేవారంతా తమ సంఘం తరుపున పెద్ద పెద్ద బ్యానర్లు, హోర్డింగులు ఏర్పాటుచేసి హోరెత్తిస్తున్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయం లేక దిక్కుతోచని స్థితిలో ఆయా పార్టీల్లో మగ్గుతున్నామని షర్మిలకు గోడును వెల్లబోసుకుంటున్నట్టు సమాచారం.
ప్రజల సమస్యలపై ప్రత్యేక ఫోకస్..
రోజుకో జిల్లాకు చెందిన రాజకీయ నాయకులు, కుల సంఘాల నేతలతో భేటీ అవ్వడమే కాకుండా.. షర్మిల ప్రజల సమస్యలపై కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తెలంగాణలో కూడా ప్రజలు ఇంకా ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆమె ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో లోటస్ పాండ్ కు సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే సామాన్యుల సంఖ్య కూడా భారీగానే పెరిగింది.
పార్టీ ఏర్పాటుకు వేగంగా పావులు!
నూతన పార్టీ ఏర్పాటుకు షర్మిల వేగంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్న ఇందిరా శోభన్ కాంగ్రెస్ కు రాజీనామా చేసి షర్మిలకు సంపూర్ణ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ సీన్ తర్వాత పార్టీ ఏర్పాటుకు షర్మిల వేగంగా ముందుకు వెళ్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో భాగంగానే పలు సంఘాల నేతలు ముందుగా వెళ్తేనే సీటు దక్కించుకునే అవకాశముందని షర్మిలను కలిసి బలాబలాలను వివరించి గుర్తింపు పొందే పనిలో పడినట్లు తెలుస్తోంది.
విద్యార్థులూ అదే దారిలో..
రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోవడం, ఉద్యోగ ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం, విద్యార్థుల సమస్యలను పట్టించుకోకపోవడం వంటి అంశాల వల్ల టీఆర్ఎస్ కు యువకులు దాదాపు దూరమయ్యారు. షర్మిల పార్టీ ప్రకటనతో మార్పునకు అవకాశం దొరుకుతుందేమోననే ఆశతో వారంతా ఆమెను కలిసి సమస్యలను చెప్పుకునేందుకు లోటస్ పాండ్ కు పోటెత్తుతున్నారు. వామపక్ష భావజాలాలున్న విద్యార్థి సంఘాలు కూడా షర్మిలను కలిసేందుకు వస్తున్నాయంటే విద్యార్థుల్లో అధికార పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు.