కొవిడ్ ఫెలుదా టెస్ట్ కథాకమామీషు!

by Anukaran |   ( Updated:2020-10-14 03:19:39.0  )
కొవిడ్ ఫెలుదా టెస్ట్ కథాకమామీషు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే అవి అధికారిక లెక్కల ప్రకారమే అనుకోండి. గ్రామాల్లో కొవిడ్ ఉధృతి అలాగే ఉంది. అయితే ఇప్పుడు వానల వల్ల మళ్లీ వైరస్ విజృంభిస్తుందా, రెండో వేవ్ వస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా కొవిడ్ టెస్ట్ అనగానే ఒక రకమైన మానసిక ఆందోళన కలుగుతుంటుంది. ఒకవేళ పాజిటివ్ వస్తే ఎలా? అనే భయం ఉంటుంది. కొవిడ్ టెస్ట్‌ను కూడా ఇంట్లోనే చేసుకోగలిగితే ఈ సమస్య ఉండదు. అలా కొవిడ్ టెస్ట్‌ను ప్రెగ్నెన్సీ టెస్ట్‌లాగా చేసుకోవడానికి వీలు కల్పించేందుకే ఫెలుదాను రూపొందించారు. ఫెలుదా అంటే ఎఫ్‌ఎన్‌సీఏఎస్9 ఎడిటర్- లిమిటెడ్ యూనిఫామ్ డిటెక్షన్ అస్సే. ఇది ఒక పేపర్ స్ట్రిప్ టెస్ట్. దీన్ని వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆమోదం కూడా తెలిపింది. ప్రముఖ దర్శకుడు, రచయిత సత్యజిత్ రే సృష్టించిన బెంగాలీ డిటెక్టివ్ కేరెక్టర్ ఫెలుదా ఆధారంగా దీనికి ఈ పేరును పెట్టారు. భారతదేశంలో తయారు చేసిన మొట్టమొదటి తక్కువ ధర గల పేపర్ ఆధారిత కరోనా టెస్ట్ ఇది.

సీఆర్‌ఐఎస్‌పీఆర్-క్యాస్ టెక్నాలజీ ఆధారంగా ఇది పనిచేస్తుంది. సార్స్ కోవ్-2 వైరస్‌కే నిర్దిష్టంగా ఉండే జన్యువులను ఇది గుర్తించి, వైరస్ ఉందా లేదా అని నిర్ధారిస్తుంది. సలైవా లేదా రక్తం నమూనాలను ఉపయోగించడం ద్వారా ఈ టెస్ట్ చేసుకోవచ్చు. సలైవాను సేకరించడం సులభం కాబట్టి ఎక్కువగా సలైవాను ఉపయోగించి ఈ టెస్ట్ చేస్తారు. అంతేకాకుండా ఇది ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్‌ మాదిరిగా కచ్చితమైన ఫలితాలను తక్కువ సమయంలో ఇస్తుందని కూడా వైద్యులు నిర్ధారించారు. ఈ టెస్ట్ కిట్‌లను సీఎస్ఐఆర్ ఐబీఐబీ, టాటా సన్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నారు. ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఒక్కో పేపర్ స్ట్రిప్‌కు రూ. 500 ఖర్చు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్‌కు రూ. 1600 నుంచి రూ. 2000 వరకు ఖర్చవుతోంది. దీని ట్రయల్ పీరియడ్‌లో 2000 మంది పేషెంట్లలో 96 శాతం కచ్చితత్వంతో ఇది ఫలితాలను చూపించింది. రానున్న రెండు మూడు వారాల్లో ఇది మార్కెట్లో లభించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story