ఖ‌మ్మం జిల్లాలో బెల్ట్ షాపుల దందా !

by Sridhar Babu |   ( Updated:2023-07-08 13:07:03.0  )
ఖ‌మ్మం జిల్లాలో బెల్ట్ షాపుల దందా !
X

దిశ‌, ఖ‌మ్మం: బెల్ట్‌షాపుల‌పై క‌న‌క వ‌ర్షం కురుస్తోంది. లాక్‌టౌన్‌తో వైన్ షాపుల‌న్నీ మూత‌ప‌డ‌టంతో బెల్టుషాపులే మందుబాబుల దాహార్తిని తీర్చుకోవ‌డానికి ఏకైక మార్గంగా మారింది. లాక్‌డౌన్ ఇప్ప‌ట్లో తొల‌గిపోయే అవ‌కాశం లేకపోవడంతో వైన్‌షాపుల య‌జ‌మానులే దుకాణాల్లో సరుకును బెల్టుషాపుల‌కు త‌ర‌లించి అమ్ముకుంటున్నారు. అయితే ఇదివరకు క్వార్ట‌ర్‌ సీసాపై బెల్టుషాపుల్లో అద‌నంగా రూ.15వ‌ర‌కు తీసుకునే వారు. కానీ ఇప్పుడు ఎంఆర్‌పీ రేటుకు మూడోంతులు అంటూ రూ.130 లిక్క‌ర్‌కు మూడోంద‌ల పైనా తీసుకుంటూ మందుబాబుల చేతిలో సీసా పెడుతున్నారు. అస‌లే మందు దొర‌క‌ని కాలం కావ‌డంతో వారు చెప్పినంత చెల్లించి తీసుకుంటున్నారు. అటు లైట్ బీరు రూ.250పైనా, స్ట్రాంగ్ బీరు క్వార్ట‌ర్ సీసాకు స‌మానంగా రూ.300వ‌ర‌కు విక్ర‌యిస్తుండ‌టం గ‌మ‌నార్హం.

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మద్యం విక్ర‌యాలు మాత్రం ష‌రామాములుగానే కొన‌సాగుతున్నాయి. పాల్వంచ మండ‌ల‌కేంద్రంలో అయితే జోరుగా విక్ర‌యాలు జ‌రుగుతున్నా అధికారులు ప‌ట్టించుకోవ‌డం లేద‌నే ఆరోప‌ణ‌లున్నాయి. అలాగే ఖ‌మ్మం న‌డిబొడ్డున కూడా విక్ర‌యాలు జ‌రుగుతున్నాయి. వైన్‌షాపు వెనుక నుంచి విక్ర‌యాలు నిర్వ‌హిస్తుండ‌టంతో పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేయ‌డంతో ఎక్సైజ్ అండ్ పోలీస్ అధికారులు దాదాపు రూ.3ల‌క్ష‌ల విలువ చేసే మ‌ద్యాన్ని సీజ్ చేశారు. అలాగే దుకాణ యాజ‌మానిని అదుపులోకి తీసుకుని స్టేష‌న్‌కు త‌ర‌లించిన విష‌యం తెలిసిందే.

ఇదిలా ఉండ‌గా ప‌ట్ట‌ణాల్లో అయితే కొంత పోలీసుల నిఘా ఉండ‌టంతో మ‌ద్యం విక్ర‌యాలు కాస్త క‌ట్ట‌డి ఉన్నా.. గ్రామాల్లో మాత్రం విక్ర‌యాలకు అడ్డు లేకుండా పోయింది. అలాగే చంద్రుగొండ మండ‌ల కేంద్రంలో బెల్ట్‌షాపుల్లో య‌థేచ్చ‌గా మ‌ద్యం విక్ర‌యాలు చేస్తున్న ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వైన్ షాపుల మాదిరిగా, మినీ బార్ల‌ను త‌ల‌పిస్తూ బెల్టుషాపులు న‌డుస్తుండ‌టం గ‌మ‌నార్హం. బెల్ట్‌షాపు నిర్వాహాకుల‌కు వేలల్లో పెట్టుబ‌డి.. ల‌క్ష‌ల్లో లాభాలు అన్న‌ట్లుగా మారింది. అధికారుల‌కు తెలిసినా.. చూసీ చూడ‌న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తుండటం విశేషం.

Advertisement

Next Story

Most Viewed