మహిళలపై హింస పెరగడానికి మూడు ప్రధాన కారణాలు..!

by Shyam |   ( Updated:2021-04-29 12:02:59.0  )
మహిళలపై హింస పెరగడానికి మూడు ప్రధాన కారణాలు..!
X

దిశ, ఫీచర్స్ : పురాణాలు, ఉపనిషత్తులు, మహాభారత రామాయణ కావ్యాల్లో దేవతామూర్తులుగా కొలవబడిన స్త్రీమూర్తులు.. భూమ్మీద మాత్రం పురుషులతో సమాన హక్కుల కోసం నిత్యం పోరాడుతున్న పరిస్థితి. ఆకాశంలో సగభాగం అని కీర్తించబడినవారు.. నేడు తమ అస్థిత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం శ్రమించాల్సి వస్తోంది. ఈ టెక్ ఎరాలో సైతం సరైన అవకాశాలు అందుకోవడంలో వివక్షకు గురువుతున్నారనేది వాస్తవం. నేటికీ ఈ పురుష సమాజం వాళ్లను స్వయం నిర్ణయాధికారం గలవారిగా భావించకపోవడం ఓ కారణం కాగా.. మహిళలను కేవలం తమ అవసరాలు తీర్చే సాధనాలుగా, పిల్లల్నీ కనే యంత్రాలుగా, శృంగార అవసరంగా చూసే సంస్కృతి సమసిపోవడం లేదు. దీనికి తోడు మద్యం మత్తులో భార్యలు, ప్రియురాళ్లపై హింసకు పాల్పడే సంఘటనల గురించి తెలిసిందే. ఈ క్రమంలో మద్యపానం, పురుషాహంకార భావనలు కలిసి మహిళలపై రెట్టింపు హింసకు దారి తీస్తున్నట్టుగా తాజా అధ్యయనంలో వెల్లడైంది.

సాధారణంగా సొసైటీలో మహిళలపై తమ భర్తలు హింసకు పాల్పడిన ఘటనలు పరిశీలిస్తే.. మద్యం మత్తులో ఉన్నప్పుడు జరిగినవే ఎక్కువ. కానీ తాజా అధ్యయనం ప్రకారం మద్యపానం, హింస మధ్య సంబంధం.. మహిళల పట్ల పురుషుల వివక్షాపూరిత వైఖరి (విషపూరితమైన మగతనం) ద్వారా కూడా ప్రభావితం అవుతోందని సైంటిఫిక్ జర్నల్‌ అడిక్షన్‌లో ప్రచురితమైంది. ఈ స్థితిలో మహిళలకు ఇష్టం ఉన్నా, లేకున్నా బలవంతంగా తమ కోరికలు తీర్చుకుంటూ లైంగికంగా హింసిస్తున్నారని వెల్లడించింది. నిజానికి మహిళల మీద పురుష హింస అనేది ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. కానీ మద్యపానం, సెక్సిజం, పురుష హింస వంటి పరస్పర చర్యల కారణంగా తక్కువ, మధ్య-ఆదాయ దేశాల్లో(ఎల్‌ఎంఐసీ) భార్యలు, ప్రియురాళ్లపై హింస(ఇంటిమేట్ పార్టనర్ వాయిలెన్స్ లేదా ఐపీవీ) అధిక ఆదాయ దేశాల్లో కంటే ఎక్కువగా ఉన్నట్టు ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

బంగ్లాదేశ్, కాంబోడియా, చైనా, ఇండోనేషియా, పపువా న్యూ గినియా, శ్రీలంక, తైమూర్ లెస్తే వంటి ఏడు ఏషియన్-పసిఫిక్ ఎల్‌ఎంఐసీ దేశాల్లోని 9148 మంది పెళ్లయిన పురుషులు లేదా భాగస్వామి(మహిళ)తో కలిసి ఉంటున్న వారిపై ఈ అధ్యయనం చేపట్టారు. ఈ మేరకు నెలలో ఒక్కసారైనా ఒకే సెషన్‌లో 6 పెగ్గుల కంటే ఎక్కువగా తాగేవారిని హెవీ ఎపిసోడిక్ డ్రింకర్స్‌(అతిగా మద్యం సేవించేవారు)గా నిర్ధారించారు. జెండర్-ఈక్విటబుల్ మెన్ (జీఈఎం) స్కేల్ ఉపయోగించి వీరిలోని లింగ వైఖరులను నమోదు చేశారు. ఇది సెక్సువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, లైంగిక సంబంధాలు, హింస, ఇంటి పని, హోమోఫోబియాకు సంబంధించిన లింగ నిబంధనల పట్ల పురుషుల వైఖరులను లెక్కగడుతుంది.

కాగా, మొత్తం మీద 13% మంది పురుషులు గత 12 నెలల్లో శారీరక లేదా లైంగిక ఐపీవీ(ఇంటిమేట్ పార్టనర్ వాయిలెన్స్)కి పాల్పడినట్లు నివేదించారు. ఊహించినట్లుగానే అతిగా మద్యం సేవించడం, పురుషుల్లో మహిళలు తక్కువ అనే భావన ఐపీవీని పెంచాయి. ఈ ఐపీవీ నిష్పత్తి.. తాగి సంయమనం పాటించేవారి కంటే రెగ్యులర్‌గా అతిగా మద్యం సేవించేవారిలో 3.42 రెట్లు ఎక్కువగా నమోదు కాగా, జీఈఎం స్కేల్‌పై లింగ సమానత్వ వైఖరిలో ఒక్కో పాయింట్ తగ్గుదల.. ఐపీవీ అసమానతలో 7% పెరుగుదలకు కారణమవుతోంది.

రెండు సమస్యలను పరిష్కరిస్తేనే..

ఇప్పటికే పాతుకుపోయిన సంప్రదాయక లింగ నిబంధనలు, విపరీతమైన తాగుడుతో కలిసినపుడు ఐపీవీ బాధితులను మరింత ప్రమాదానికి గురిచేయవచ్చు. ప్రతీచోట.. ముఖ్యంగా తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో సన్నిహిత భాగస్వామిపై హింసను పరిష్కరించాలంటే ముందుగా మహిళల పట్ల లింగ వివక్ష, ప్రమాదకర స్థాయిలో ఆల్కహాల్ వినియోగం.. ఈ రెండు సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

– డాక్టర్ అన్నే మారీ లాస్లెట్, ప్రముఖ రచయిత

Advertisement

Next Story

Most Viewed