అక్షయ్ కుమార్ మద్దతుతో ‘ఫౌజీ’ గేమ్

by Anukaran |
అక్షయ్ కుమార్ మద్దతుతో ‘ఫౌజీ’ గేమ్
X

దిశ, వెబ్‌డెస్క్ :
చైనాకు చెందిన పబ్జీ గేమ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే, గేమింగ్ ప్రియులను పబ్జీ తరహాలో ఆకట్టుకునే విధంగా బెంగళూరుకు చెందిన భారతీయ సంస్థ ఎన్ కోర్ గేమ్స్ ( nCore Games) త్వరలో మల్టీ ప్లేయర్‌ గేమ్‌ను తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఈ గేమ్ కోసం బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌తో చేతులు కలిపింది. కాగా, ఈ గేమ్ త్వరలోనే రాబోతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ ఉద్యమంలో భాగంగా దీన్ని తీసుకొస్తున్నట్లు అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ‘ఫౌజీ’ (ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌-గార్డ్స్‌) అనే పేరుతో త్వరలోనే ఈ గేమ్‌ను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ గేమ్ కేవలం వినోదం కోసమే కాదు, భారత జవాన్ల త్యాగాలను తెలియజేసేలా ఉంటుందన్నారు.

గత జూన్‌లో గాల్వాన్‌ లోయలో భారత్‌, చైనా సైనికుల మధ్య మొదటి ఘర్షణ జరిగింది. ఇందులో కనీసం 20 మంది భారత సైనికులు మరణించారు. అప్పటి నుంచి వాస్తవాధీన రేఖ వద్ద రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొన్ని చైనా యాప్స్‌ను భారత్‌ నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా బుధవారం పబ్జీ గేమ్‌ సహా మరో 118 చైనా మొబైల్ అప్లికేషన్లు, గేమ్స్‌ను నిషేధించింది. అయితే, భారత్‌లో బాగా ప్రాచుర్యం పొందిన పబ్జీ గేమ్‌కు అడిక్ట్ అయిపోయిన కొందరు టీనేజర్స్.. పబ్జీని బ్యాన్ చేయడంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన గేమర్లను దృష్టిలో పెట్టుకుని.. భారతీయ సంస్థ పబ్జీ తరహాలో మల్టీ ప్లేయర్ గేమ్ ‘ఫౌజీ’ని తీసుకొస్తోంది. గాల్వాన్‌ వ్యాలీ పోరాటం ఆధారంగా ఫౌజీ ఆటను రూపొందించారు. కొన్ని నెలలుగా ఈ గేమ్‌ రూపకల్పన జరుగుతుండగా, అక్టోబర్‌ చివరి నాటికి మార్కెట్‌లోకి రానున్నట్లు తెలుస్తోంది.

ఈ గేమ్‌ ద్వారా సమకూరే ఆదాయంలో 20 శాతం ‘భారత్‌కా వీర్‌ ట్రస్ట్‌’కు అందజేయనున్నామని అక్షయ్ కుమార్ వెల్లడించారు. అక్షయ్‌ దీనికి మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు. ఫౌజీ (FAU: G) అంటే సైనికుడు అని అర్థం. ఈ పేరును అక్షయ్‌ కుమార్‌ సూచించారని ‘ఎన్ కోర్ గేమ్స్’ సంస్థ వెల్లడించింది. అక్షయ్‌కుమార్ శుక్రవారం ‘ఫౌజీ‘ గేమ్ గురించి ట్వీట్ చేశారు. ‘ఈ యాక్షన్‌ గేమ్‌కు మద్దతు తెలపడానికి నేను గర్వపడుతున్నాను. ఫియర్‌లెస్‌ అండ్ యునైటెడ్ గార్డ్స్ ఫౌజీ.. మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరుకుంటున్న ఆత్మనిర్భర్‌ భారత్‌కు ప్రతిరూపం. ఇది కేవలం వినోదాన్ని అందించడమే కాదు, మన సైనికుల త్యాగాలను గుర్తు చేస్తుంది. దీనిపై వచ్చిన ఆదాయంలో 20 శాతాన్ని సదరు సంస్థ సైనికుల సంక్షేమానికి కేటాయిస్తుంది’ అని అక్షయ్‌ కుమార్‌ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed