వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర ఆర్థికమంత్రి వ్యాఖ్యలు

by srinivas |
వాస్తవాలకు విరుద్ధంగా కేంద్ర ఆర్థికమంత్రి వ్యాఖ్యలు
X

దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ.2.70కే ఇస్తుండగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం యూనిట్‌కు రూ.9 ఛార్జ్ చేస్తోందంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం స్పందించారు. విద్యుత్‌పై నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఇండస్ట్రియల్‌ విద్యుత్‌ టారిఫ్‌ రూ.7.65 ఉందని తెలిపారు. 2017లో ఉన్న టారిఫ్‌నే కొనసాగిస్తున్నామని, నిర్మల చెబుతున్న రూ.9 ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదన్నారు. అలాగే, రూ.2.75కి విద్యుత్‌ను ఎక్కడ ఇస్తున్నారో కేంద్రం చెప్పాలని ప్రశ్నించారు. పరిశ్రమలకు ఏ రాష్ట్రం కూడా రూ.7కు తక్కువగా విద్యుత్‌ ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. మైన్స్‌ కేటాయించాలని కేంద్రాన్ని ఎన్ని సార్లు కోరినా పట్టించుకోవడం లేదనీ, దీంతో రాష్ట్రం ఏటా రూ.2,500 కోట్ల మేర నష్టపోతోందని తెలిపారు. విద్యుత్‌ అప్పు రూ.70వేల కోట్లు ఉందని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించలేదని వెల్లడించారు. విద్యుత్‌ సంస్థల అప్పుల పాపం తమది కాదని చెప్పారు.

అలాగే, నిర్మలాసీతారామన్ చేసిన వారసత్వ రాజకీయాల వ్యాఖ్యలపై మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో నేరుగా ఎన్నిక కానివాళ్లు, ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేగా పనిచేయని వాళ్లు, ఏ అర్హత లేనివాళ్లు, కొడుకులో, కూతుర్లో అవడం వల్ల నేరుగా మంత్రులు అవుతున్నారని, ఈ విషయాన్ని తాము కూడా అంగీకరిస్తున్నామని అజయ్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed