TRS నేతలకు ఓట్లే ముఖ్యం.. సంక్షేమం కాదు!

by Shyam |
TRS నేతలకు ఓట్లే ముఖ్యం.. సంక్షేమం కాదు!
X

దిశ, తెలంగాణ బ్యూరో :

రాష్ట్రంలో ప్రజా అవసరాలు పట్టని టీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కోసం ఊరూరా తిరగడం విడ్డురంగా ఉందని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ఓట్ల ప్రచారం కోసం వచ్చేవారిని తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కష్టకాలంలో LRS రూపంలో పేద, మధ్యతరగతి ప్రజల రక్తం పీలుస్తున్న ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలన్నారు. ఎమ్మెల్సీ ఓట్లపై ఉన్న ప్రేమ, ఉద్యోగులకు ఇవ్వాల్సిన PRC, IR, DA గురించి మాట్లాడటంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. లాక్‌డౌన్ సమయంలో జీతాలు, పెన్షన్ల కోతలపై అధినాయకత్వాన్ని ఎనాడూ ప్రశ్నించని గులాబీ నాయకులు ఇప్పుడెలా ఓట్లు అడగటానికి వచ్చారని విమర్శించారు.

రాష్ట్రంలో 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే 27 వేల మంది స్వీపర్లను, మిషన్ భగీరథలోని ఇంజినీర్లను, జీహెచ్ఎంసీ, యూనివర్సిటీలలోని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగస్తులను ప్రభుత్వం తొలగించిందని మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక ఇచ్చిన ఉద్యోగాలకన్నా తొలగించిన ఉద్యోగాలే ఎక్కువని గుర్తుచేశారు. ఇంటికొక ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీలు కేవలం ఓట్లకోసమేనని, ఇది నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వమన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్- 3 ఉద్యోగాల అడ్రస్ లేదని, గ్రూప్- 4 పరీక్షలు రాసినా నియామకాలు జరగలేదని, పోలీస్ కానిస్టేబుల్, ఫైర్‌మెన్ ఫలితాలు వెలువడినా శిక్షణకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. రాష్ట్రంలో 30 వేలకుపైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదని, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఒక్క నియామకం కూడా చేపట్టలేదన్నారు. ప్రభుత్వ విద్యాసంస్థలను నాశనం చేసి ప్రైవేటు విశ్వవిద్యాలయాలను ప్రోత్సహించి విద్యా వ్యాపారానికి ఈ ప్రభుత్వం పునాదులు వేస్తున్నారని దయ్యబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగావకాశాలు రాని నిరుద్యోగులకు రూ. 3,016 చొప్పున నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed