వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు కష్టకాలం

by Anukaran |
వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు కష్టకాలం
X

దిశ, తెలంగాణ బ్యూరో : వ్యవసాయ మార్కెట్ యార్డులకు కష్టకాలం వస్తోంది. కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో మార్కెట్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ కమిటీల పరిధిలో ఉండే తనిఖీ కేంద్రాలకు తాళం పడటంతో అక్కడ పనిచేసే సిబ్బంది ఖాళీగా ఉంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర చట్టాన్ని ఫాలో అవుతున్నట్లు స్పష్టం చేసింది. సీఎం కేసీఆర్ ఆదివారం మార్కెటింగ్ శాఖ సమీక్షలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొత్త చట్టాలతో మార్కెట్‌కు సెస్​ రాదని తేలిపోయింది. ప్రభుత్వమే నిధులు సమకూర్చుతుందని ప్రకటించారు.

రూపాయి ఆదాయం రాని మార్కెటింగ్ శాఖకు ఏ స్థాయిలో నిధులు కేటాయిస్తారనే అంశం అనుమానంగానే ఉంది. దాదాపు 10 వేల మంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా 271 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో పెద్ద మార్కెట్లు పదుల సంఖ్యలోనే ఉంటాయి. వరంగల్ ఏనుమాముల, కే సముద్రం, కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, చొప్పదండి, ఖమ్మం మార్కెట్ యార్డులు చాలా పెద్దవి. ఈ మార్కెట్ యార్డుల్లో పాలకవర్గ సభ్యులతో పాటు, ఆదాయాన్ని బట్టి సిబ్బందిని నియమించుకున్నారు. సెలక్షన్ గ్రేడ్, స్పెషల్ గ్రేడ్, గ్రేడ్-1, 2, 3 కార్యదర్శులుండగా కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, కేసముద్రం వంటి మార్కెట్లలో స్పెషల్ గ్రేడ్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఒక్కో మార్కెట్‌లో 15 నుంచి కనీసం 40 మంది వరకు పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది వ్యవసాయ మార్కెట్లలోనే పనిచేస్తున్నారు.

సెస్‌కు మంగళం

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వ్యవసాయ మార్కెట్లకు వచ్చే ఒక శాతం సెస్ రాకుండా పోయింది. ‘ఒకే దేశం.. ఒకే మార్కెట్’ పాలసీ వీటికి శాపంగా మారింది. ఇన్నాళ్లూ మార్కెట్ యార్డుల్లో క్రయ విక్రయాలు, వాటి పరిధిలో విక్రయాలకు సైతం ఒక శాతం సెస్ వచ్చేది. దీంతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో నడిచే చెక్ పోస్టుల ద్వారా ఆదాయం సమకూరేది. ఒక్కో మార్కెట్ సగటున ఏటా రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. కానీ కొత్త చట్టాల ప్రభావంతో ఆదాయం మొత్తం పడిపోయింది. రాష్ట్రం కూడా అదే విధానాన్ని అవలంభించడంతో.. సెస్​ వసూలు చేయడం లేదు. ప్రస్తుతం ఆదాయం పూర్తిగా పడిపోవడంతో ఉద్యోగుల జీతభత్యాలు, పాలకవర్గాల ఖర్చులు వెళ్లదీయడం భారమవుతోంది. మొన్నటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొన్నారు. మెజారిటీ ధాన్యాన్ని ఐకేపీ కేంద్రాల ద్వారా కొని, మిల్లులకు పంపించారు. పత్తిని జిన్నింగ్ మిల్లుల వద్దే కాంటా పెట్టి కొంటున్నారు. గతంలో మాదిరి రైతులు యార్డుకు తీసుకువస్తే ప్రైవేటు వ్యాపారులు వేలం పాడి కొనే పరిస్థితులు లేవు. ఇప్పటికీ అక్కడక్కడ ఈ పద్ధతి ఉన్నా రానున్న రోజుల్లో ఎక్కడా కనిపించదని వ్యాపారులు అంటున్నారు. ప్రస్తుతానికి పసుపుతో నిజామాబాద్ మార్కెట్, మిర్చి కారణంగా వరంగల్ ఎనుమాముల, ఖమ్మం మార్కెట్, పత్తితో జమ్మికుంట వంటి మార్కెట్లు నామమాత్రంగా నడుస్తున్నాయి.

ఉద్యోగుల భవిష్యత్?

ప్రస్తుతం మార్కెట్ యార్డుల్లో 10 శాతం కూడా కొనుగోళ్లు సాగడం లేదు. కొత్త నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డు గేటు బయట వ్యాపారులు కొనుగోలు చేసుకోవచ్చు. మార్కెట్‌లో కొన్నా రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో పంట కొనుగోళ్లు, అమ్మకాలు తగ్గడం, ఆదాయ మార్గాలు లేకపోవడంతో ఇవి నిర్వహణ భారంగా మారుతున్నాయి. ప్రస్తుతం మినీ మార్కెట్‌లు, అంతగా ఆదాయం రాని మార్కెట్ యార్డులను వాటి పరిధిలోని పెద్ద యార్డుల్లో విలీనం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. లేకుంటే ఆ మార్కెట్​లను రద్దు చేసే ప్రయత్నాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి పాలసీ తెస్తుందనే అంశం కీలకంగా మారింది. సెస్​ రాకపోవడంతో ఉద్యోగుల వేతనాలు కూడా సర్కారు ఇవ్వాల్సిందే. దీంతో ఉద్యోగాల పరిస్థితి ఏంటి, పెన్షనర్ల భవితవ్యం ఎలా ఉండబోతోందనే ప్రశ్నలు వస్తున్నాయి. చిన్నయార్డుల్లోని ఉద్యోగులకు పెద్దయార్డుల్లోనో, ఇతర శాఖల్లోనో సర్దుబాటు చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.

పర్యవేక్షణ లేదు

ఇంతకుముందు పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల్లో మార్కెట్‌ అధికారుల పర్యవేక్షణ ఉండేది. పంటను కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ లైసెన్స్‌ పొంది ఉండాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు రైతులు ఎవరికైనా ఎక్కడైనా అమ్ముకోవడానికి కొత్త చట్టం అవకాశం ఇవ్వడంతో చాలా మంది వ్యాపారులు పుట్టుకొచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌ యార్డు బయట జరిగే లావాదేవీలపై సెస్‌ వసూలు చేయడానికి అవకాశం ఉండదు. సెస్‌ రద్దు కావడంతో మార్కెట్‌ తనిఖీ కేంద్రాలతో, బయట జరిగే క్రయవిక్రయాలతో వచ్చే ఆదాయమే లేదు. ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే కొనుగోళ్ల సీజన్ నుంచి ప్రభుత్వం కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లే చెప్పింది. ఇక ప్రైవేట్ వ్యాపారులే దిక్కు. వాస్తవంగా లైసెన్స్‌లు పొంది, అధికారుల పర్యవేక్షణ ఉన్నప్పుడే రైతులకు సరైన ధర ఇవ్వని వ్యాపారులు ఇప్పుడు ఎలా ఇస్తారనేది ప్రశ్నార్థకమే. కనీస మద్దతు ధరపై కూడా అనుమానాలున్నాయి. ఎమ్మెస్పీ ఎలా అమలవుతుందో తెలియని పరిస్థితే. అయితే కేంద్రంలో ఎలా ఉన్నా.. రాష్ట్రంలో ప్రభుత్వం రైతుల అంశంలో కీలకంగా ఉంటుందనే ఆశలున్నా.. సీఎం ప్రకటనతో అవి తేలిపోయాయి. దీంతో ఇప్పుడు వచ్చే ఉత్పత్తులను అమ్ముకోవడంపై ఇప్పటి నుంచే ఆందోళనలు మొదలవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed