- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూశాఖలో రికార్డులు బ్రేక్..!
దిశ, న్యూస్‌బ్యూరో, మెదక్: అవినీతి నిరోధక శాఖ (ACB)కు రెవెన్యూ శాఖకు చెందిన వారే అత్యధికంగా చిక్కుతున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి అతి భారీ స్థాయిలో లంచం తీసుకుంటున్న రెవెన్యూ అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా ACB పట్టుకోగలిగింది. అందులో హైదరాబాద్ జిల్లా షేక్‌పేట డిప్యూటీ తహసీల్దార్ నాగార్జున రెడ్డి జూన్ 6వ తేదీన రూ.15 లక్షలు, ఆగస్టు 14న మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దార్ రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడగా, తాజాగా ఓ జిల్లా స్థాయి అధికారి రూ.1.12 కోట్లు లంచం డీల్ కుదుర్చుకుని, ముందుగా రూ.40 లక్షలు తీసుకున్న వ్యవహారాన్ని ఏసీబీ బట్టబయలు చేసింది. ఇటీవల కీసర తహసీల్దార్ నాగరాజు ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి అధికారిగా పేరు నమోదు చేయాలని ఓ స్వచ్ఛంద సంస్థ గిన్నిస్ రికార్డ్స్ వారిని కోరిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఒక అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారి అంతకు మించి లంచం తీసుకున్న కేసులో బుక్ అవడం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో….
వివరాలివి..
శాసన సభలో నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టిన రోజే ఒక అడిషనల్ కలెక్టర్ అవినీతి బాగోతాన్ని ఏసీబీ అధికారులు బట్టబయలు చేశారు. మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ మరికొందరు రెవెన్యూ అధికారులు కలిసి నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి గ్రామం సర్వే నెంబర్ 58లోని 112 ఎకరాల భూమికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ.కోటి.12 లక్షలు డిమాండ్ చేశారు. అందులో భాగంగా బాధితుడి నుంచి రెండు విడతలుగా రూ.40 లక్షలను తీసుకున్నారు. తన బినామీ కోలా జీవన్ గౌడ్ పేరుమీద 5 ఎకరాల భూమిని అగ్రిమెంట్ చేసుకున్నాడు.
సర్వే ల్యాండ్ రికార్డ్స్ జూనియర్ అసిస్టెంట్ వసీం రూ.5 లక్షలు తీసుకోగా, మిగతా మొత్తం కోసం బాధితుడి నుంచి అగ్రిమెంట్ (హామీ పత్రం) కూడా రాసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో అడిషనల్ కలెక్టర్ నగేష్ మిగతా సొమ్ము కోసం బాధితుడిని వేధిస్తున్న క్రమంలో ఏసీబీని ఆశ్రయించినట్టుగా తెలుస్తోంది. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు డీఎస్పీ సూర్యానారాయణ నేతృత్వంలో అడిషనల్ కలెక్టర్ నివాసం మాచవరం, కొంపల్లితో పాటు ఆయన బంధువుల ఇళ్లు, నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయం, ఆర్డీవో అరుణారెడ్డి నివాసం ఘట్ కేసర్‌తో పాటు నర్సాపూర్, చిల్పిచేడ్ తహసీల్దార్ కార్యాలయాలు, నివాసాల్లో ఏక కాలంలో దాదాపు 12 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
డాక్యుమెంట్లు, కీలక ప్రతాల స్వాధీనం..
అడిషనల్ కలెక్టర్ నగేష్ నివాసంలో ఆడియో టేప్ తో పాటు పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు, ఫోన్ లు సీజ్ చేశారు. హైదరాబాద్ బోయిన్ పల్లి బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ లాకర్ ను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఆర్డీవో అరుణారెడ్డి నివాసంలో రూ.20 లక్షల నగదు, అర కేజీ బంగారం లభ్యమైంది. గతంలో మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేసిన నగేష్ ఇటీవలే అదనపు కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపై విస్తృతమైన పట్టు ఉండడంతో కాళ్లకల్, మనోహరాబాద్, తూఫ్రాన్, నర్సాపూర్, చిల్పిచేడ్, పాపన్నపేట్, రామయంపేట్, చేగుంట మండలాల్లోని అసైన్డ్ భూములకు సంబంధించి ఎన్ఓసీలు, ఇతరత్రా వ్యవహారాల్లో కీలకపాత్ర పోషిస్తూ భారీగా అక్రమాస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. నగేష్ కు హైదరాబాద్ లో కూడా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
రేట్ ఫిక్స్ చేసిన ఘనుడు..
నర్సాపూర్ మండలం చిప్పల్ తుర్తి పరిధి సర్వే నెంబర్ 58 లో బై నెంబర్లతో మొత్తం 547 ఎకరాల భూమి ఉంది. అందులో 180 ఎకరాలను మూర్తి మరికొంతమంది కలిసి 1982లో కొనుగోలు చేశారు. గ్రామస్తులు చెబుతున్న ప్రకారం అవన్నీ అసైన్డ్ భూములు. వాటిలో చాలా వాటికి అధికారులు గతంలోనే క్లియరెన్స్ ఇచ్చారు. కొన్ని 1988లో పట్టాలు కూడా అయినట్టు సమాచారం. అందులోనే మూర్తి మరికొంత మందికి చెందిన 112 ఎకరాలు ఉండగా క్లియరెన్స్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) కోసం వారు స్థానిక అధికారులను సంప్రదించారు. విషయం తెలుసుకున్న నగేష్ స్థానిక రెవెన్యూ సిబ్బందితో కలిసి డీల్ మాట్లాడారు.
అందులో భాగంగానే రూ.1.12 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుని, అడ్వాన్స్ గా రూ.40 లక్షలు తీసుకున్నట్టు బుధవారం ఏసీబీ అధికారుల దాడుల్లో తేటతెల్లమైంది. మిగతా డబ్బు కోసం చర్చలు జరుగుతుండగా ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. దీంతో అసలు గుట్టు రట్టు అయ్యింది. కాగా, ఎకరానికి లక్ష చొప్పున లంచం రేటు ఫిక్స్ చేసిన ఘనత కూడా అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ కే దక్కుతుందని పలువురు అనుకుంటున్నారు. అధికారులు తీసుకుంటున్నది లంచమా, లేక వాటాలే అడుగుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం మవుతున్నాయని పేర్కొంటున్నారు.
క్లియరెన్స్ ఇవ్వొద్దని ఆర్డర్స్..
మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ పై అనేక అవినీతి ఆరోపణలున్నాయి. గతంలో కలెక్టర్ గా పనిచేసిన ధర్మారెడ్డి పదవీ విరమణ పొందగానే అడిషనల్ కలెక్టర్ నగేష్ జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లతో సమావేశమై తనకు తెలియకుండా ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వొద్దని హెచ్చరించినట్టు పలువురు తహసీల్దార్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారి కావడంతో కొందరు తహసీల్దార్లు నగేష్ కు వత్తాసు పలుకుతూ అడుగులకు మడుగులు ఒత్తుతున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. సాయంత్రం పొద్దు పోయే దాకా సోదాలు నిర్వహించిన అనంతరం అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్ ను, ఆయన బినామీ కోలా జీవన్ గౌడ్ లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.