పోలీస్‌స్టేషన్ నుంచి నిందితుడి ఎస్కేప్.. పోతూపోతూ ఏం చేశాడంటే!

by Sumithra |   ( Updated:2021-12-19 04:39:55.0  )
Jail
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్ : పోలీసుల అదుపులో ఉన్న నిందితుడు స్టేష‌న్ నుంచి ప‌రారైన ఘ‌ట‌న వ‌రంగ‌ల్‌ ప‌ట్టణంలోని ఓ స్టేష‌న్‌లో శ‌నివారం రాత్రి చోటుచేసుకుంది. విశ్వస‌నీయ సమాచారం మేరకు.. కొద్ది రోజుల కిందట గంజాయి విక్రయిస్తున్న కేసులో సీసీఎస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని సంబంధిత స్టేష‌న్ అధికారుల‌కు అప్పగించారు. నాటి నుంచి స్టేష‌న్‌లోనే నిందితుడిని ఉంచి విచార‌ణ చేస్తున్నారు. అయితే, కొద్దిరోజులుగా నిందితుడు స్టేష‌న్‌లోనే ఉండ‌టం, పారిపోయే అవ‌కాశం లేద‌ని సిబ్బంది కాస్త అతివిశ్వాసం చూపించ‌డ‌మే ఇప్పుడు వారికి ఇబ్బందులు తెచ్చిన‌ట్లుగా తెలుస్తోంది. శ‌నివారం రాత్రి స్టేష‌న్‌లో కొద్దిసేపు ప‌వ‌ర్ క‌ట్ కావ‌డంతో ఇదే అదునుగా స‌ద‌రు నిందితుడు ఎస్కేప్ అయిన‌ట్లుగా తెలుస్తోంది.

పోతుపోతూ ఇద్దరు కానిస్టేబుళ్ల ప‌ర్సులు దొంగ‌లించ‌డం గ‌మ‌నార్హం. స్టేషన్‌లో ప‌వ‌ర్ క‌ట్ కావ‌డంతో సీసీ ఫుటేజీలో ఎలాంటి దృశ్యాలు రికార్డు కాలేద‌ని స‌మాచారం. ఈ విష‌యం ఉన్నతాధికారుల‌కు తెలియ‌కుండానే మేనేజ్ చేద్దామ‌ని స్టేష‌న్ అధికారులు ప్రయ‌త్నించినా చివ‌రికు బ‌య‌ట‌కు లీక్ అయ్యింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు స్టేషన్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ ర‌మ‌ణ రాక‌తో సీపీతో పాటు ఇత‌ర ముఖ్య అధికారులంతా ఆయ‌న భ‌ద్రత విష‌యంలో త‌ల‌మున‌క‌లై ఉన్నారు.ఈ స‌మ‌యంలోనే విచార‌ణ‌ కోసం అదుపులోకి తీసుకున్న నిందితుడు ప‌రారీ కావ‌డం పోలీస్‌ క‌మిష‌న‌రేట్ అధికారుల‌ను విస్మయానికి గురి చేసింద‌ని చెప్పాలి. పారిపోయిన నిందితుడిని ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారని తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed