ఊరికే పవర్ స్టార్ అయిపోరు : అబ్బూరి రవి

by Shyam |
ఊరికే పవర్ స్టార్ అయిపోరు : అబ్బూరి రవి
X

దిశ, వెబ్‌డెస్క్: రాత్రికి రాత్రే పవర్‌స్టార్ అయిపోరు.. అలాగనీ బై బర్త్ రావాలని కాదు.. అంతకుముందే ఉండాలేమో! అంత గొప్ప వ్యక్తిత్వం గురించి ఎంత రాసినా.. ఎంత పొగిడినా తక్కువే అంటూ పవన్‌తో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు రచయిత అబ్బూరి రవి. మనిషిని మనిషిలా చూడటం ఆయనకున్న గొప్ప గుణం అని.. ఇతరుల బాధను చూసి చలించిపోవడం.. సంతోషం చూసి చిన్నపిల్లాడిలా ఆనందపడటం.. అన్యాయం జరిగితే ఆవేశపడటం.. సమాజానికి ఏదో చేయాలనే తాపత్రయం.. ఇవే ఆయనను శిఖర సమానంగా నిలబెట్టాయని చెబుతున్నారు అబ్బూరి.

‘ఒక అర్థరాత్రి డిస్కషన్ మధ్యలో, నాకు నడుము నొప్పి వస్తోంది సర్ అనగానే, టక్కున లేచి లోపలికి వెళ్తే.. కోపం వచ్చిందేమోనని భయపడ్డాను. ఆయన చాప, దిండు తెచ్చి నన్ను పడుకోమని, ప్యాడ్ పెన్ పట్టుకొని నా పక్కనే కింద కూర్చుని మీరు చెప్పండి నేను రాస్తా అన్నారు. అప్పటికి నా మొదటి సినిమా రిలీజ్ కూడా అవలేదు. ఆయన పవర్‌స్టార్. 5 రోజుల పరిచయం, గుడుంబా శంకర్ సినిమా కోసం. ‘నాకు తెలీదు ఆ సినిమాలో నా పేరు వేస్తారని, అంత గౌరవం ఇస్తారని. మనిషిని మనిషిలా గౌరవించే ఆయన గుణం ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఊరికే పవర్ స్టార్ అయిపోరు. ఆయన దగ్గర అబద్దం ఆడక్కర్లేదు, చప్పట్లు కొట్టక్కర్లేదు, పొగడక్కర్లేదు. మనం మనలా ఉండొచ్చు’.

‘అన్నవరం సినిమా షూటింగ్ మొదలయ్యే టైమ్‌కు బొమ్మరిల్లు రిలీజ్ అవలేదు. స్క్రిప్ట్, డైలాగ్స్ కోసం రాత్రి పగలు ఆయనతో గడిపిన ప్రతి క్షణం ఇంకా గుర్తున్నాయంటే అది ఆయన గొప్పదనం అంతే. అన్నవరం టైమ్‌లో ఆయనకిచ్చిన నా ‘1983 చందమామ కథల బౌండ్’ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, పంజా సినిమా రాయడానికి ముందు ఒక అసిస్టెంట్‌తో పంపించి, అందినట్టు కాల్ చేయమని ఫోన్ నెంబర్ ఇచ్చారు. ‘పుస్తకం విలువ తెలిసిన మనిషికి జీవితం విలువ ఖచ్చితంగా తెలుస్తుంది’.

‘బాధ వస్తే అమ్మ ఒడిని వెతుక్కునే పసిపిల్లాడు. మంచితనం చూస్తే పరవశం. ఆడపిల్లకి అవమానం జరిగితే ఆవేశం, లేనితనం చూస్తే కంట్లో నీళ్లు. సమాజానికి ఏదో చెయ్యాలన్న తపన, ఈ లక్షణాలు అప్పటికప్పుడు రావు. బై బర్త్ కూడా కాదు, బిఫోర్ బర్త్ నుంచే ఉండాలి. అంతే! ఆయన వ్యక్తిత్వం గురించి నా మాటల్లో చెప్పాలని ‘పంజా’ సినిమాలో ప్రయత్నించాను. అప్పుడు పుట్టిన మాటలే ‘సాయం చేసినవాడు కృతజ్ఞత కోరుకోవడం ఎంత తప్పో, సాయం పొందినవాడు కృతజ్ఞత చూపించకపోవడం కూడా అంతే తప్పు’.

ప్రజల కోసం, ప్రజల పక్కన నిలబడాలన్న ఆయన ఆశయం సంపూర్ణంగా నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ఆయన బాగుంటే కోట్ల మంది బాగుంటారని నమ్ముతూ, ఆయన పెదాల మీద చిరునవ్వు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అబ్బూరి రవి.

Advertisement

Next Story

Most Viewed