చేతబడితో భయపెట్టి.. ప్రియురాలు భర్తను బెదిరించి.. చివరకు!

by Sumithra |
DSP-Venkateshwar-Reddy
X

దిశ, నల్లగొండ: కొత్తగా వివాహమైన యువతిని ప్రేమపేరుతో వేధింపులకు పాల్పడి, చివరికి చేతబడి చేసి భయబ్రాంతులకు గురిచేసిన నిందితుడిని నల్లగొండ రూరల్ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. డీఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం రంగారెడ్డినగర్‌కు చెందిన మురళి ప్రైవేట్ జాబ్ చేస్తున్నాడు. రాంగ్ కాల్ ద్వారా గుండ్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మురళి ఆ మహిళతో అప్పుడప్పుడు చాటింగ్ చేస్తూ, ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. అప్పటికే ఆమెకు వివాహం కావడంతో తప్పు అని చెబుతూ వచ్చింది. దీంతో మురళి తీవ్రమనస్తాపానికి గురై ఎలాగైనా ఆ మహిళను ఆమె భర్తతో గొడవలు పెట్టించి విడగ్గొట్టాలనుకున్నాడు.

ఈ క్రమంలో ఫేస్ బుక్, యూ ట్యూబ్‌లలో చేతబడి ఎలా చేయాలో తెలుసుకున్నాడు. అనంతరం ఆమె ఇంటిఎదుట గేటు వద్ద ఓ జంతువు ఎముక, జాకెట్ ముక్కలు, బియ్యం, కుంకుమ, గాజులు, జీడిగింజలు, వెంట్రుకలు, నిమ్మకాయలును పెట్టి చేతబడి పేరుతో భయబ్రాంతులకు గురిచేశాడు. ముందుగా గతనెల జూన్ 11న కుంకుమ, పసుపు, జీడిగింజలు వేశాడు. అంతేగాకుండా.. ఆమె భర్తకు ఫోన్ చేసి అసభ్యపదజాలంతో దూషిస్తూ బెదిరిపులకు పాల్పడ్డాడు. మళ్లీ జులై 6వ తేదీన రాత్రి సుమారు 12.00 గంటల సమయంలో నిందితుడు మురళి బైక్‌పై గుండ్లపల్లి గ్రామానికి వచ్చి మళ్లీ వాళ్ల ఇంటిఎదుట ఎముకలు, కుంకుమ,జీడిగింజలు, గవ్వలు, నిమ్మకాయలు, వెంట్రుకలు, వక్కలు, తెల్ల, నల్లటి గుడ్డ ముక్కలు, కుంకుమ పసుపు కలిపిన బియ్యం వంటి పధార్థాలను గేటు ఎదుట వదిలి పెట్టి వెళ్లాడు.

దీంతో తీవ్రభయాందోళనకు గురైన బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీ కెమెరాలు, సెల్ ఫోన్ టవర్ ఆధారంగా ఆధారాలు సేకరించారు. ఇవాళ(సోమవారం) ఉదయం మునుగోడు బైపాస్ వద్ద మురళిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా, నేరం ఒప్పుకున్నాడు. ఈ సమావేశంలో టూ టౌన్ సీఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, ట్రైనీ ఎస్.ఐ. రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed