ఈ ప్రస్థానం ఏ ముగింపుకో ..

by srinivas |
ఈ ప్రస్థానం ఏ ముగింపుకో ..
X

దిశ, ఏపీ బ్యూరో: రాజకీయాలంటే అమ్మకం..కొనుగోళ్లే. ఇదేదో సినిమాలో డైలాగ్ లా ఉంది కధా . కానీ అది ఇప్పుడు ఆచరణలో చాలా స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో మున్సిపల్​ఎన్నికలు అందుకు అద్దం పడుతున్నాయి. ఎన్నికలంటే ఓటర్లను ప్రలోభ పెట్టడం ఇప్పటిదాకా చూశాం. కానీ ఇప్పుడు నయా ట్రెండ్​ నడుస్తోంది. పోటీ చేసిన వాళ్లను లోబరుచుకోవడం ద్వారా నెగ్గడమనే సూత్రం తెరపైకి వచ్చింది. ఇది కేవలం పురపోరుతో ఆగేట్లు లేదు. సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగేట్లుంది. ఓ దశాబ్దం కిందటి వరకు ఈ కొనుగోళ్ల వ్యవహారం ఓటర్ల వరకే పరిమితమైంది.

కేంద్రంలో ఎన్డీఏ సర్కారు వచ్చిన ఏడేళ్లలో పోటీ చేసిన వాళ్లను లోబరుచుకోవడం పరిపాటి అయింది. గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయింపులను, ఓటర్ల విశ్వాసాన్ని తుంగలో తొక్కి మరో పార్టీలోకి జంప్​అయ్యేవాళ్లు ఎక్కువయ్యారు. రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి పనికిమాలిన పనులను ప్రోత్సహించడం ఎక్కువైంది. ఇది కేవలం రాష్ట్రానికే పరిమితం కాలేదు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో ఓడినా, తగినంత బలం లేకున్నా ప్రత్యర్థి పార్టీల్లో గెలిచిన వాళ్లను కొనుగోలు చేసి ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అది ఇప్పుడు ఆయా రాష్ట్రాల్లోని అధికార పార్టీల్లో కింది స్థాయికి పాకింది. భవిష్యత్తులో ఇక ఎన్నికలు జరగకపోవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్న మాటలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. ఒకవేళ జరిగినా ఇలాంటి ప్రలోభ వేలంపాట ఎన్నికలే దిక్కేమో.

ఇప్పటిదాకా అన్నీ వ్యవస్థలను రాజకీయాలు భ్రష్టు పట్టించాయి. అందులో ఎన్నికల వ్యవస్థ మినహాయింపు కాదు. భ్రష్టు పట్టిన రాజకీయాలను తుదకంటా మార్చడానికి వైసీపీ కంకణం కట్టుకుందని ఒకనాటి ప్రజాసంకల్పయాత్రలో జగన్​ఉద్ఘాటించారు. ఇతర పార్టీల నుంచి చేర్చుకునే ప్రజా ప్రతినిధుల విషయంలో ఇదే నానుడి కొనసాగించారు. వాళ్ల పదవికి రాజీనామా చేసి వస్తేనే పార్టీలో చేర్చుకుంటామని కుండబద్దలు కొట్టారు. మున్సిపల్​ఎన్నికల్లో అందుకు భిన్న వైఖరి కనిపిస్తోంది. శాసనసభలో అలా.. మున్సిపాలిటీల్లో ఇలా ఎందుకు ? కొన్నాళ్లు దోస్తీ చేస్తే వాళ్లు వీళ్లలా మారిపోతారంటారు.

Advertisement

Next Story

Most Viewed