మొక్కగా ఎదిగే మాస్క్.. నితిన్ ఎకోఫ్రెండ్లీ ప్రొడక్ట్

by Anukaran |
seed mask
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ మహమ్మారి నుంచి మనల్ని కాపాడే ఆయుధాల్లో ‘మాస్క్’ ఒకటి. కరోనా బారిన పడకుండా ఉండేందుకు గతేడాది నుంచి మాస్క్‌లు వినియోగిస్తుండగా, వాటి ఉపయోగం తర్వాత పలువురు ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే సముద్రాల్లో మాస్క్‌ల వల్ల విపరీతమైన చెత్త పేరుకుపోతుండగా, సముద్ర జీవులకు వాటివల్ల అపారనష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. పట్టణాల్లోనూ ఈ సమస్య విపరీతంగానే ఉంది. దాంతో మంగళూరుకు చెందిన ఎన్విరాన్‌మెంటల్ లవర్ నితిన్ వాస్ తన ‘పేపర్ సీడ్ కో’ సంస్థ ద్వారా ఓ మాస్క్ రూపొందించి పర్యావరణహిత పరిష్కారం చూపించాడు.

Paper Seed Co

నితిన్ రూపొందించిన మాస్క్ వైరస్ నుంచి కాపాడటమే కాకుండా, దాన్ని నేల మీద పారేస్తే అది ఓ మొక్కగా వృద్ధి చెందడం విశేషం. కాటన్ మాస్క్‌లు వాస్తవానికి రీసైకిల్ రాగ్స్‌(క్లాత్ పీసెస్)తో తయారవుతాయని నితిన్ వాస్ తెలిపారు. వస్త్ర పరిశ్రమ నుంచి సేకరించిన కాటన్ ప్లప్, వివిధ స్క్రాప్ పదార్థాలను ఉపయోగించి మాస్క్ ఔటర్ కవర్ తయారు చేశారు. లోపలి లైనింగ్‌ను మృదువైన పత్తి వస్త్రంతో తయారు చేస్తారు. అవి తగినంత మందంగా ఉండటంతో, ఇన్‌ఫెక్షన్స్ రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటాయి.

పర్యావరణ హితం కోసం ఈ ఆవిష్కరణ..

2017 నుంచి వివిధ రీసైకిల్, ప్లాంట్ సీడ్ ఆధారిత వస్తువులను తయారు చేస్తున్న మా సంస్థ, కొవిడ్ టైమ్‌లో ముసుగులతో ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. కొవిడ్ పరిస్థితుల్లో మానవులకు మాస్క్ చాలా అవసరం. కానీ అవి ఇతర జాతులకు సమస్యలను సృష్టిస్తున్నాయి. చాలా నిర్లక్ష్యంగా మనం వినియోగించిన మాస్క్‌ను రోడ్లపై పడేస్తాం. ఆ మాస్క్‌లు నదులు, మహాసముద్రాల్లో పేరుకుపోతున్నాయి. పర్యావరణానికి, జల జీవులకు కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో వినూత్నంగా ఈ ఆవిష్కరణ చేశాం. పత్తితో తయారైన మా మాస్కులను ఒకసారి ఉపయోగించిన తర్వాత మట్టిలో పూడ్చి, కొద్దిగా నీరు పోస్తే చాలు. కొద్ది రోజుల్లోనే అది మొక్కగా పెరుగుతుంది. వీటిని తయారు చేసేందుకు మాకు రూ.25 ఖర్చవుతుంది. వీటిని తయారు చేసేందుకు మెషిన్స్ ఉపయోగించడం లేదు. స్థానిక ప్రజలకు ఉపాధి కల్పిస్తున్నాం. అందుకే కాస్త ధర ఎక్కువగానే ఉంటాయి. అయితే ఇది లాభార్జనే ధ్యేయంగా చేస్తున్న పని కాదు. పర్యావరణహితం కోసం మేం కష్టపడుతున్నాం. గ్రామ ప్రజలకు శిక్షణ ఇవ్వడంతో పాటు ప్రతిభావంతులైన యువకుల శక్తిని ఉపయోగించుకుంటాం.
– నితిన్, పేపర్ సీడ్ కో ఫౌండర్

Advertisement

Next Story

Most Viewed