భార్య ఎవరితోనో ఫోన్‌‌లో మాట్లాడుతోందని…

by Sumithra |   ( Updated:2020-05-26 09:56:43.0  )
భార్య ఎవరితోనో ఫోన్‌‌లో మాట్లాడుతోందని…
X

దిశ, హైదరాబాద్: భార్యపై అనుమానంతో భర్త బండరాయితో మోది చంపిన సంఘటన బాచుపల్లి పోలీస్‌‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీలోని ప.గో. జిల్లా ఏలూరుకు చెందిన సతీశ్, జయలక్ష్మికి 16ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పదేళ్లుగా బాచుపల్లిలోని రాజీవ్‌గాంధీ‌‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. సతీశ్ చందానగర్‌లోని ఓ గోల్డ్‌షాపులో ఉద్యోగం చేస్తుండగా.. జయలక్ష్మి నిజాంపేట హిల్‌కౌంటీలో మూడేళ్లుగా హౌస్‌కీపింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. అయితే భార్య జయలక్ష్మి నాలుగైదు రోజులుగా ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుందని అనుమానపడిన సతీశ్‌ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. జయలక్ష్మి ఈ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పగా.. లాక్‌డౌన్ కారణంగా రాలేకపోతున్నామని, మేం వచ్చేవరకు బంధువుల ఇంట్లో ఉండమని సలహా ఇచ్చారు. దీంతో జయలక్ష్మి బంధువుల ఇంటికి వెళ్లగా సోమవారం అక్కడికి వెళ్లిన సతీశ్‌ భార్యతో గొడవ పడ్డాడు. తర్వాత అతన్నిబంధువులు ఇంటికి పంపించగా మళ్లీ రాత్రి 10.30గంటల సమయంలో వెళ్లిన సతీశ్ నిద్రిస్తున్న జయలక్ష్మిపై బండరాయి ఎత్తివేయడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. జయలక్ష్మి తమ్ముడు నూకరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story