అధికారుల నిర్లక్ష్యం..సీఎం జగన్‌కు 15ఏళ్ల బాలిక లేఖ

by srinivas |
అధికారుల నిర్లక్ష్యం..సీఎం జగన్‌కు 15ఏళ్ల బాలిక లేఖ
X

దిశ, ఏపీ బ్యూరో: తండ్రి చిన్నతనంలోనే మరణించాడు. కడుపులో పెట్టుకుని చూసిన తల్లి కరోనాకు బలైంది. తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే డెత్ సర్టిఫికెట్ ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. తల్లిని తండ్రిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న చిన్నారికి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అధికారులు అక్కడకు వెళ్లు ఇక్కడకు వెళ్లు అంటూ సమాధానాలు చెప్తున్నారు. ఆ అధికారుల నిర్లక్ష్యాన్ని భరించలేని ఆ బాలిక ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేఖ రాసింది. తన గోడు వెళ్లబోసుకుంది. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా అల్లూరుకు చెందిన బిరుదవోలు నోషిత అనే బాలికకు చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. నెలరోజుల క్రితం తల్లి కూడా గుండెపోటుతో మృతి చెందింది. అనాధగా మారిన నోషిత తల్లి డెత్ సర్టిఫికెట్ కోసం అప్లై చేసింది. అయితే సర్టిఫికెట్ ఇవ్వడంలో అధికారులు కాస్త నిర్లక్ష్యం వ్యవహరించారు. దీంతో విసిగిపోయిన ఆమె.. ఏకంగా సీఎంకు లేఖరాసింది. లేఖలో ఏమి రాసిందంటే.!

”జగన్‌ మామయ్యా..! చిన్నప్పుడే తండ్రికి దూరమయ్యాను. కళ్లల్లో పెట్టుకొని చూసుకున్న తల్లి ప్రాణాలు కోల్పోయింది. మైనర్‌ని అయిన నేను అమ్మమ్మ సంరక్షణలో ఉంటున్నా. అమ్మ డెత్‌ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నా. మంజూరు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ వేధిస్తున్నారు. విసిగిపోయి మానసికంగా కుంగిపోయాను” అంటూ లేఖ రాసింది. తన లేఖను రిజిస్టర్ పోస్టు ద్వారా ముఖ్యమంత్రికి పంపింది. అయితే ఈ లేఖ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని వెంటనే అధికారులతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా జెడ్పీ సీఈఓ పి.సుశీల, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డా.రాజ్యలక్ష్మికి ఫోన్ చేసి నోషిత సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అల్లూరు మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడి డెత్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 15 నిముషాల్లో నోషితకు తన తల్లి అనుపమ పేరుతో డెత్ సర్టిఫికెట్ జారీ చేశారు. అధికారులు స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి నోషితకు డెత్ సర్టిఫికెట్ అందజేశారు. కొన్ని సాంకేతిక కారాణాల వల్ల డెత్ సర్టిఫికెట్ జారీ చేయడం ఆలస్యమైందని అధికారులు వివరించారు.

Advertisement

Next Story