ఎవరీ మయాంక్ యాదవ్.. ట్రెండింగ్‌లో లక్నో యువ పేసర్

by Harish |
ఎవరీ మయాంక్ యాదవ్.. ట్రెండింగ్‌లో లక్నో యువ పేసర్
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17 లో లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు ఖాతా తెరిచింది. పంజాబ్ కింగ్స్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో గెలుపులో యువ పేసర్ మయాంక్ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లో అతనికి ఇదే అరంగేట్ర మ్యాచ్. తొలి మ్యాచ్‌లోనే ఈ ఢిల్లీ పేసర్ అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. మొదట పంజాబ్ పతనానికి శ్రీకారం చుట్టిందే మయాంక్. ఛేదనలో 101/0 స్కోరుతో పంజాబ్ దూకుడుగా ఉన్న సమయంలో లక్నో కెప్టెన్ పూరన్.. మయాంక్‌‌కు బంతి అందించాడు. పూరన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అతను వమ్ము చేయలేదు. తొలి ఓవర్‌లో 10 పరుగులు సమర్పించుకున్నా.. మిగతా మూడు ఓవర్లలో తన పేస్‌తో బెంబేలెత్తించాడు.

బెయిర్‌‌‌స్టో‌ను అవుట్ చేసి ఐపీఎల్‌లో తొలి వికెట్ సాధించిన అతను.. వరుస ఓవర్లలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్, జితేశ్ శర్మలను పెవిలియన్ పంపాడు. దీంతో మిడిలార్డర్‌లో కీలక వికెట్లు కోల్పోయిన పంజాబ్ తడబడి మ్యాచ్‌ను దూరం చేసుకుంది. మయాంక్ 4 ఓవర్లలో 3 వికెట్లు తీసి 27 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతేకాకుండా, ఈ సీజన్‌లోనే వేగవంతమైన బంతిని సంధించాడు. 12వ ఓవర్‌లో 156 కేపీహెచ్ వేగంతో విసిరిన బంతిని ఆడేందుకు ధావన్ తడబడ్డాడు. అలాగే, పలు మార్లు 150 కేపీహెచ్ స్పీడ్‌తో బంతులు వేశాడు.

దీంతో ‘ఎవరీ మాయంక్ యాదవ్’ అంటూ నెటిజన్లు గూగుల్‌లో తెగవెతికేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈ యువ పేసర్ దేశవాళీలో ఢిల్లీ జట్టు తరపున 17 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో 34 వికెట్లు తీశాడు. అలాగే, 10 టీ20 మ్యాచ్‌ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ ఐపీఎల్‌లో లక్నో ఫ్రాంచైజీ మయాంక్‌ను కనీస ధర రూ.20 లక్షలు కొనుగోలు చేసింది. అయితే, గాయం కారణంగా అతను ఆ సీజన్‌కు దూరమయ్యాడు. తాజాగా అరంగేట్ర మ్యాచ్‌లో సత్తాచాటిన మయాంక్ తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోవడం విశేషం.

Advertisement

Next Story