పరాగ్ పరాక్రమం.. రాజస్థాన్‌కు వరుసగా రెండో విజయం

by Swamyn |
పరాగ్ పరాక్రమం.. రాజస్థాన్‌కు వరుసగా రెండో విజయం
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్-17వ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సాధించింది. ఇదే సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా రెండో ఓటమిని సైతం మూటగట్టుకుంది. జైపూర్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీపై రాజస్థాన్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ అజేయ అర్ధసెంచరీ(84*)తో చెలరేగడంతో జట్టు భారీ స్కోరు చేసింది. 186 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్.. 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేయగలిగింది. వార్నర్(49), త్రిస్టన్ స్టబ్స్ (44*) మినహా మిగతా బ్యాటర్లెవరూ అంతగా రాణించలేదు. దీంతో 12 పరుగుల తేడాతో ఈ సీజన్‌లో రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది. రాజస్థాన్ బౌలర్లలో యుజువేంద్ర చాహల్, నండ్రె బర్గర్ రెండేసి వికెట్లు తీయగా, ఆవేశ్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, నోర్ట్జే, అక్షర్, కుల్దీప్ యాదవ్‌లు తలో వికెట్ తీశారు.

ఆరంభంలో తడబాటు

టాస్ ఓడి బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్‌కు ఏమాత్రం శుభారంభం దక్కలేదు. ఓపెనర్ యశస్వీ జైశ్వాల్(5) స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో తొమ్మిది పరుగులకే రాజస్థాన్ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్.. మరో ఓపెనర్ బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించేందుకు ప్రయత్నించాడు. కానీ, ప్రత్యర్థి బౌలర్లు అందుకు అవకాశం ఇవ్వలేదు. తొలి వికెట్ పడిన కొంతసేపటికే వెంటవెంటనే జోస్ బట్లర్(11), సంజూ శాంసన్(15)ను పెవిలియన్‌కు పంపించారు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శాంసన్ కీపర్ పంత్‌కు క్యాచ్ ఇవ్వగా, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో బట్లర్ ఎల్బీడబ్ల్యూగా అవుటయ్యాడు. దీంతో కేవలం 36 పరుగులకే టాప్-3 బ్యాటర్లను కోల్పోయిన రాజస్థాన్ తీవ్ర కష్టాల్లో పడిపోయింది.

ఒకే ఒక్కడు పరాగ్

36కే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చిన యువ బ్యాటర్ రియాన్ పరాగ్.. అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన తోటి బ్యాటర్లు క్రీజులో నిలదొక్కుకునేందుకే ఇబ్బంది పడుతూ, అంతలోనే పెవిలియన్‌కు చేరుతున్న క్రమంలో.. పరాగ్ తన పరాక్రమం చూపించాడు. బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలోనే తొలుత కాస్త నెమ్మదిగా ఆచితూచి ఆడాడు. కానీ, క్రీజులో ఎప్పుడైతే నిలదొక్కుకున్నాడో అప్పట్నుంచీ చెలరేగిపోయాడు. ఫోర్లు సిక్సులతో దంచికొట్టాడు. 34 బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సుల సాయంతో అర్ధసెంచరీ చేసుకున్న పరాగ్.. ఆ తర్వాత మరింత రెచ్చిపోయాడు. పరాగ్‌తో భాగస్వామ్యం నిర్మించే క్రమంలోనే అశ్విన్(29), ధ్రువ్ జురెల్(20) స్వల్ప స్కోర్లకే అవుటైనా, పరాగ్ మాత్రం ఆఖరి ఓవర్ వరకూ పట్టు వదల్లేదు. షిమ్రాన్ హెట్‌మేయర్ వేసిన ఆఖరి ఓవర్లో వరుసగా 4, 4, 6, 4, 6, 1తో ఏకంగా 25 పరుగులు పిండుకున్నాడు. దీంతో రాజస్థాన్ జట్టు 185 పరుగుల భారీ స్కోరును సాధించింది. 45 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సులతో 85 పరుగులు చేసిన పరాగ్.. నాటౌట్‌గా నిలిచాడు.

తడబడ్డ ఢిల్లీ బ్యాటర్లు

186 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ బ్యాటర్లు.. అంతగా రాణించలేదు. వార్నర్, త్రిస్టన్ స్టబ్స్ మినహా మిగతావారంతా తడబడ్డారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్(49), మిచెల్ మార్ష్(23)ల జోడీ క్రీజులో కుదురుకుందనగా, రాజస్థాన్ బౌలర్ బర్గర్ భారీ దెబ్బకొట్టాడు. తాను వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లలో మిచెల్ మార్ష్, రికీ భుయ్(0)ని అవుట్ చేశాడు. దీంతో 30 పరుగులకే ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్(28) కూడా అంతగా రాణించలేకపోయాడు. మరోవైపు, కెప్టెన్ రిషబ్ పంత్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యం నిర్మించిన వార్నర్(49) అర్ధసెంచరీకి ఒక్క పరుగు దూరంలో క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగాడు. అప్పటికే క్రీజులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పంత్(28)ను చాహల్ పెవిలియన్ పంపించాడు. దీంతో 105కు 4వికెట్లు కోల్పోయిన ఢిల్లీ.. కష్టాల్లో పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన త్రిస్టన్ స్టబ్స్ (44 నాటౌట్; 23బంతుల్లో) చెలరేగి ఆడాడు. విజయంపై ఆశలు రేకెత్తించాడు. కానీ, మరో ఎండ్ నుంచి అతనికి అంతగా సహకారం లభించలేదు. ఫలితంగా ఢిల్లీ జట్టు.. విజయానికి 12 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఈ సీజన్‌లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది.

స్కోరు బోర్డు

రాజస్థాన్ రాయల్స్: 185/5 (20 ఓవర్లు)

యశస్వీ జైశ్వాల్ (బి) ముకేశ్ కుమార్ 5, బట్లర్ (ఎల్బీడబ్ల్యూ) కుల్దీప్ యాదవ్ 11, సంజూ శాంసన్ (సి) పంత్ (బి) ఖలీల్ అహ్మద్ 15, రియాన్ పరాగ్ 84 నాటౌట్, అశ్విన్ (సి) త్రిస్టన్ (బి) అక్షర్ 29, ధ్రువ్ జురెల్ (బి) నోర్ట్జే 20, హెట్‌మేయర్ 14 నాటౌట్.

వికెట్ల పతనం: 9-1, 30-2, 36-3, 90-4, 142-5

బౌలింగ్: ఖలీల్ అహ్మద్ (4-0-24-1), ముకేశ్ కుమార్ (4-0-49-1), నోర్ట్జే (4-0-48-1), అక్షర్ (4-0-21-1), కుల్దీప్ యాదవ్ (4-0-41-1)

ఢిల్లీ క్యాపిటల్స్: 173/5 (20 ఓవర్లు)

డేవిడ్ వార్నర్ (సి) సందీప్ శర్మ (బి) ఆవేశ్ ఖాన్ 49, మిచెల్ మార్ష్ (బి) బర్గర్ 23, రికీ భుయ్ (సి)సంజూ శాంసన్ (బి) బర్గర్ 0, పంత్ (సి) శాంసన్ (బి) చాహల్ 28, త్రిస్టన్ 44 నాటౌట్, అభిషేక్ పోరెల్ (సి) బట్లర్ (బి) చాహల్ 9, అక్షర్ పటేల్ 15 నాటౌట్.

వికెట్ల పతనం: 30-1, 30-2, 97-3, 105-4, 122-5

బౌలింగ్: ట్రెంట్ బౌల్ట్ (3-0-29-0), బర్గర్ (3-0-29-2), అశ్విన్ (3-0-30-0), ఆవేశ్ ఖాన్ (4-0-29-1), చాహల్ (3-0-19-2), సందీప్ శర్మ(4-0-36-0)

Advertisement

Next Story