ఆఖరి ఓవర్‌లో లక్నో గెలుపు.. ముంబైకి హ్యాట్రిక్ ఓటమి

by Harish |
ఆఖరి ఓవర్‌లో లక్నో గెలుపు.. ముంబైకి హ్యాట్రిక్ ఓటమి
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్‌కు వరుసగా మూడో పరాజయం. మొత్తంగా 7వ ఓటమి. ఐపీఎల్-17లో ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయి. అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ముందడుగు వేయడం కష్టమే. మరోవైపు, ముంబైపై గెలుపుతో లక్నో సూపర్ జెయింట్స్ నాకౌట్ ఆశలు మెరుగుపర్చుకున్నది. లక్నో వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబైపై 4 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌ చేసిన ముంబై 144/7 మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నేహాల్(46) టాప్ స్కోరర్.. టిమ్ డేవిడ్(35), ఇషాన్ కిషన్(32) రాణించడంతో ఆ స్కోరైనా దక్కింది. అనంతరం 145 పరుగుల లక్ష్యాన్ని లక్నో 6 వికెట్లు కోల్పోయి చివరి ఓవర్‌లో ఛేదించింది. స్టోయినిస్(62) హాఫ్ సెంచరీతో సత్తాచాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో లక్నో రెండో స్థానాలు టాప్-4లోకి ప్రవేశించింది. 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మరోవైపు, ముంబై 6 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నది.

రాణించిన స్టోయినిస్

145 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు లక్నో శ్రమించాల్సి వచ్చింది. ఆఖరి ఓవర్‌లో ఆ జట్టు విజయతీరాలకు చేరింది. స్టోయినిస్ రాణించకపోయి ఉంటే ఆ జట్టు పరిస్థితి మరోలా ఉండేదేమో. ఛేదన ఆరంభంలోనే ఆ జట్టుకు షాక్ తగిలింది. తొలి ఓవర్‌లో ఓపెనర్ అర్షిన్ కులకర్ణి(0) డకౌటయ్యాడు. అనంతరం కేఎల్ రాహుల్, స్టోయినిస్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. 4వ ఓవర్‌లో స్టోయినిస్ రెండు ఫోర్లు కొట్టగా.. ఆ తర్వాతి ఓవర్‌లో రాహుల్ మూడు ఫోర్లు, ఓ సిక్స్ దంచేశాడు. దీంతో పవర్ ప్లేలో లక్నో 52/1తో నిలవడంతో ఆ జట్టు విజయం సులభమే అని అంతా అనుకున్నారు. కానీ, కాసేపటికే పాండ్యా వేసిన 8వ ఓవర్‌లో రాహుల్(28) అవుటవడంతో ఈ జోడీకి తెరపడింది. మిగతా బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. అయితే, దీపక్ హుడా(18) సహకారంతో స్టోయినిస్ ఇన్నింగ్స్ నడిపించాడు. దీంతో 13 ఓవర్లలో 99/2తో లక్నో విజయానికి చేరువైంది. ఈ పరిస్థితుల్లో ముంబై బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి లక్నోపై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో పాండ్యా బౌలింగ్‌లోనే హుడా కూడా వెనుదిరిగాడు. అదే ఓవర్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన స్టోయినిస్(62)ను ఆ తర్వాతి ఓవర్‌లో నబీ అవుట్ చేయడంతో ముంబై జట్టులో ఆశలు చిగురించాయి. అష్టన్ టర్నర్(5), ఆయుశ్ బడోని(6) విఫలమవడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు కావాల్సి ఉండగా ముంబై బౌలర్లు అద్భుతం చేస్తారేమో అని ఎక్కడో ఆలోచనా ఉన్నా.. పూరన్(11 నాటౌట్) మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.

ముంబైలో ఆ ముగ్గురు మినహా

అంతకుముందు ముంబై ఇన్నింగ్స్‌లో నేహాల్, టిమ్ డేవిడ్, ఇషాన్ కిషన్ తప్ప మిగతా వారందరూ తేలిపోయారు. ఫలితంగా ఆ జట్టు మొదటి నుంచే తడబడింది. లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముంబై బ్యాటర్లు వికెట్లు సమర్పించుకున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ(4) దారుణంగా నిరాశపరిచాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుటయ్యాడు. సూర్యకుమార్(10), తిలక్ వర్మ(7), హార్దిక్ పాండ్యా(0) కూడా అతనిదారిలోనే పెవిలియన్ చేరారు. దీంతో 27 పరుగులకే ముంబై 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో ఓపెనర్ ఇషాన్ కిషన్, నేహాల్ నిర్మించే బాధ్యతను మీదేసుకున్నారు. లక్నో బౌలింగ్‌లో వికెట్ కాపాడుకుంటూ ఆచితూచి ఆడారు. వీరు ధాటిగా ఆడేందుకు చూసిన ప్రయత్నాలను లక్నో బౌలర్లు తిప్పికొట్టడంతో పరుగులు కావాల్సినన్నీ రాలేదు. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్(32) వెనుదిరగడంతో ఐదో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అప్పటివరకు నిదానంగా ఆడని నేహాల్(46).. మయాంక్ యాదవ్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు, ఫోర్ కొట్టి గేర్ మార్చినా అది ఎంతో సేపు కాదు. కాసేపటికే మోహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో అతను వెనుదిరిగాడు. ఇక, చివరి మూడు ఓవర్లలో టిమ్ డేవిడ్(35 నాటౌట్) ధాటిగా ఆడాడు. 18వ ఓవర్‌లో వరుసగా 4,6 కొట్టిను అతను.. ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు పిండుకోవడంతో ముంబైకి పోరాడే స్కోరు దక్కింది. లక్నో బౌలర్లలో మోహ్సిన్ ఖాన్ 2 వికెట్లు తీయగా.. స్టోయినిస్, నవీన్ ఉల్ మక్, మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.

స్కోరుబోర్డు

ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ : 144/7(20 ఓవర్లు)

ఇషాన్ కిషన్(సి)మయాంక్(బి)రవి బిష్ణోయ్ 32, రోహిత్(సి)స్టోయినిస్(బి)మోహ్సిన్ ఖాన్ 4, సూర్యకుమార్(సి)రాహుల్(బి)స్టోయినిస్ 10, తిలక్ వర్మ రనౌట్(రవి బిష్ణోయ్) 7, పాండ్యా(సి)రాహుల్(బి)నవీన్ ఉల్ హక్ 0, నేహాల్(బి)మోహ్సిన్ ఖాన్ 46, టిమ్ డేవిడ్ 35 నాటౌట్, నబీ(బి)మయాంక్ 1, గెరాల్డ్ కోయ్టజి 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.

వికెట్ల పతనం : 7-1, 18-2, 27-3, 27-4, 80-5, 112-6, 123-7

బౌలింగ్ : స్టోయినిస్(3-0-19-1), మోహ్సిన్ ఖాన్(4-0-36-2), నవీన్ ఉల్ హక్(3.5-0-15-1), మయాంక్ యాదవ్(3.1-0-31-1), రవి బిష్ణోయ్(4-0-28-1), దీపక్ హుడా(2-0-13-0)

లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ : 145/6(19.2 ఓవర్లు)

కేఎల్ రాహుల్(సి)నబీ(బి)పాండ్యా 28, అర్షిన్ కులకర్ణి ఎల్బీడబ్ల్యూ(బి)నువాన్ తుషారా 0, స్టోయినిస్(సి)తిలక్(బి)నబీ 62, దీపక్ హుడా(సి)బుమ్రా(బి)పాండ్యా 18, పూరన్ 14 నాటౌట్, అష్టన్ టర్నర్(బి)గెరాల్డ్ కోయ్టజి 5, ఆయుశ్ బడోని రనౌట్(నమన్ ధిర్/ఇషాన్ కిషన్) 6, కృనాల్ పాండ్యా 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.

వికెట్ల పతనం : 1-1, 59-2, 99-3, 115-4, 123-5, 133-6

బౌలింగ్ : నువాన్ తుషారా(4-0-30-1), బుమ్రా(4-0-17-0), గెరాల్డ్ కోయ్టజి(3-0-29-1), పీయూశ్ చావ్లా(3-0-23-0), పాండ్యా(4-0-26-2), నబీ(1.2-0-16-1)

Advertisement

Next Story