ఎదురులేని రాజస్థాన్.. బెంగళూరుపై గెలుపు

by Harish |
ఎదురులేని రాజస్థాన్.. బెంగళూరుపై గెలుపు
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్-17లో రాజస్థాన్ రాయల్స్‌‌కు ఎదురులేకుండా పోయింది. టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తున్న ఆ జట్టు వరుసగా నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. శనివారం జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో ఓడించింది. మరోవైపు, బెంగళూరుకు ఇది హ్యాట్రిక్ పరాజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. కోహ్లీ(113 నాటౌట్) అజేయ శతకంతో చెలరేగి ఆర్సీబీకి అండగా నిలిచాడు. డుప్లెసిస్(44) రాణించాడు. అనంతరం 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ అలవోకగానే ఛేదించింది. 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ఓపెనర్ బట్లర్(100 నాటౌట్) అజేయ మెరుపు శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ సంజూ శాంసన్(69) కూడా సత్తాచాటాడు. ఈ విజయంతో రాజస్థాన్ పాయింట్స్ టేబుల్‌లో ఒక్క స్థానాన్ని మెరుగుపర్చుకుని అగ్రస్థానానికి చేరుకుంది.

రాణించిన శాంసన్.. బాదేసిన బట్లర్

184 పరుగుల టఫ్ టార్గెట్‌ ఛేదనలో రాజస్థాన్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. తొలి ఓవర్‌లోనే ఓపెనర్ యశస్వి జైశ్వాల్(0)ను రీస్ టోప్లే పెవిలియన్ పంపాడు. దీంతో రాజస్థాన్ ఖాతా తెరవకముందే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత మరో ఓపెనర్ జోస్ బట్లర్, కెప్టెన్ సంజూ శాంసన్ ఇన్నింగ్స్ నిర్మించారు. మొదట వీరు నిదానంగానే ఆడారు. అయితే, బట్లర్ 5వ ఓవర్‌లో రెండు ఫోర్లు, 6వ ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టి దూకుడు మొదలుపెట్టాడు. శాంసన్ కూడా దూకుడుగా ఆడాడు. దీంతో రాజస్థాన్ స్కోరు 11 ఓవర్లలో 100 దాటింది. దీంతో మ్యాచ్‌పై రాజస్థాన్ పూర్తి పట్టు సాధించింది. ఈ క్రమంలో బట్లర్ 30 బంతుల్లో, శాంసన్ 33 బంతుల్లో హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. అనంతరం కూడా అదే దూకుడు కొనసాగించడంతో వీరిద్దరే మ్యాచ్‌ను ముగించేలా కనిపించారు. అయితే, సిరాజ్ బౌలింగ్‌లో శాంసన్(69) అవుటవడంతో రెండో వికెట్‌కు 148 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. అనంతరం రియాన్ పరాగ్(4), ధ్రువ్ జురెల్(2) నిరాశపర్చినప్పటికీ.. హెట్మేయర్(11 నాటౌట్) సహకారంతో బట్లర్‌ మిగతా పని పూర్తి చేశాడు. ఆఖరి ఓవర్‌లో తొలి బంతిని బట్లర్ సిక్స్ బాది శతకం పూర్తి చేయడంతోపాటు జట్టును విజయతీరాలకు చేర్చాడు.

కోహ్లీ అంతా తానై..

అంతకుముందు బెంగళూరు ఇన్నింగ్స్‌లో హైలెట్ అంటే కోహ్లీ ఆటనే. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ అజేయంగా నిలిచి ఇన్నింగ్స్‌ను అంతా తానై నడిపించాడు. మొదట డుప్లెసిస్‌తో కలిసి జట్టుకు శుభారంభం అందించాడు. తొలి వికెట్‌కు ఈ జోడీ 125 పరుగులు జోడించింది. అయితే, రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వీరు దూకుడుగా ఆడలేకపోయారు. అయినప్పటికీ విరాట్ ఆచితూచి ఆడుతూ అడపాదడపా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. పవర్ ప్లేలో నిదానంగా ఆడిన డు ప్లెసిస్ బౌల్ట్ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు బాది గేర్ మార్చాడు. మరోవైపు, రియాన్ పరాగ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టిన కోహ్లీ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కాసేపటికే డుప్లెసిస్(44)ను చాహల్ అవుట్ చేయడంతో ఈ జోడీకి తెరపడింది. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్(1), సౌరవ్ చౌహాన్(9) నిరాశపరిచారు. దీంతో విరాట్ ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చింది. ఆఖర్లో దూకుడు పెంచిన విరాట్ వరుస బౌండరీలు బాదాడు. 19వ ఓవర్‌లో కోహ్లీ 67 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ సీజన్‌లో ఇదే తొలి శతకం. ఇక, చివరి ఓవర్‌లో మూడు కోహ్లీ మూడు ఫోర్లు కొట్టడంతో బెంగళూరు స్కోరు 180 దాటింది. కోహ్లీ 113 పరుగులతో అజేయంగా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్‌ 2 వికెట్లు తీయగా.. నాండ్రే బర్గర్‌కు ఒక్క వికెట్ దక్కింది.

స్కోరుబోర్డు

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ : 183/3(20 ఓవర్లు)

కోహ్లీ 113 నాటౌట్, డు ప్లెసిస్(సి)బట్లర్(బి)చాహల్ 44, మ్యాక్స్‌వెల్(బి) నాండ్రే బర్గర్ 1, సౌరవ్ చౌహాన్(సి)యశస్వి జైశ్వాల్(బి)చాహల్ 9, గ్రీన్ 5 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 11.

వికెట్ల పతనం : 125-1, 128-2, 155-3

బౌలింగ్ : బౌల్ట్(3-0-30-0), నాండ్రే బర్గర్(4-0-33-1), అశ్విన్(4-0-28-0), అవేశ్ ఖాన్(4-0-46-0), యుజువేంద్ర చాహల్(4-0-34-2), రియాన్ పరాగ్(1-0-10-0)

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : 189/4(19.1 ఓవర్లు)

జైశ్వాల్(సి)మ్యాక్స్‌వెల్(బి)రీస్ టోప్లే 0, జోస్ బట్లర్ 100 నాటౌట్, శాంసన్(సి)యశ్ దయాల్(బి)సిరాజ్ 69, రియాన్ పరాగ్(సి)కోహ్లీ(బి)యశ్ దయాల్ 4, ధ్రువ్ జురెల్(సి)కార్తీక్(బి)రీస్ టోప్లే 2, హెట్మేయర్ 11 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 3.

వికెట్ల పతనం : 0-1, 148-2, 155-3, 164-4

బౌలింగ్ : రీస్ టోప్లే(4-0-27-2), యశ్ దయాల్(4-0-37-1), సిరాజ్(4-0-35-1), మయాంక్ దగర్(2-0-34-0), గ్రీన్(3.1-0-27-0), హిమాన్షు శర్మ(2-0-29-0)

Advertisement

Next Story

Most Viewed