థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాదే విజయం

by Harish |
థ్రిల్లింగ్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాదే విజయం
X

దిశ, స్పోర్ట్స్ : న్యూయార్క్ వేదికగా మరో స్వల్ప స్కోర్ల థ్రిల్లింగ్ మ్యాచ్. భారత్, పాక్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరిగి ఒక్క రోజు గడవకముందే అదే వేదికపై సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు విజయం కోసం నువ్వానేనా అన్నట్టు పోరాడాయి. బంగ్లా బెంబేలెత్తించినా విజయం మాత్రం సఫారీలనే వరించింది. సోమవారం జరిగిన గ్రూపు డి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 4 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా గెలుపొందింది. సౌతాఫ్రికాకు ఇది హ్యాట్రిక్ విజయం. దీంతో ఆ జట్టు సూపర్-8 బెర్త్ చేరుకున్నట్టే. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 113/6 స్కోరే చేసింది. క్లాసెన్(46) టాప్ స్కోరర్. బంగ్లా బౌలర్లలో తాంజిద్ హసన్(3/18) చెలరేగడంతో సఫారీలు స్వల్ప స్కోరుకే పరిమితమయ్యారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా‌ను సౌతాఫ్రికా బౌలర్లు కట్టడి చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 109/7 స్కోరుకే పరిమితమైంది. తౌహిద్ హృదోయ్(37) టాప్ స్కోరర్. స్పిన్నర్ కేశవ్ మహరాజ్(27/3), రబాడా(2/19), నోర్జే(2/17) బంగ్లా ఓటమిని శాసించారు.

ఆదుకున్న క్లాసెన్

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ కూడా తడబడుతూనే సాగింది. బంగ్లా బౌలర్ తాంజిమ్ హసన్ ధాటికి దక్షిణాఫ్రికా 23 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తాంజిద్ హసన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు హెండ్రిక్(0), డికాక్(18), ట్రిస్టన్ స్టబ్స్(0)లను అవుట్ చేశాడు. తస్కిన్ అహ్మద్ బౌలింగ్‌లో కెప్టెన్ మార్‌క్రమ్(4) పెవిలియన్ చేరాడు. టాపార్డర్ విఫలమైన సమయంలో క్లాసెన్ జట్టును ఆదుకున్నాడు. అతనికి మిల్లర్ కూడా తోడుగా నిలిచాడు. మిల్లర్ డిఫెన్స్‌కే పరిమితమవ్వగా.. క్లాసెన్ అడపాదడా బౌండరీలతో మెరిశాడు. వీరు ఐదో వికెట్‌కు 79 రన్స్ జోడించడంతో సౌతాఫ్రికా స్కోరు 100 దాటింది. హాఫ్ సెంచరీ దిశగా వెళ్తున్న క్లాసెన్(46)ను తస్కిన్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆ తర్వాతి ఓవర్‌లోనే మిల్లర్(29) వెనుదిరిగాడు. జాన్సెన్(5 నాటౌట్), మహరాజ్(4 నాటౌట్) అజేయంగా నిలిచారు. బంగ్లా బౌలర్లలో తాంజిద్ హసన్ 3, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లతో సత్తాచాటగా.. రిషద్ హుస్సేన్‌కు ఒక్క వికెట్ దక్కింది.

బంగ్లా చేజేతులా..

గెలవాల్సిన మ్యాచ్‌ను బంగ్లా చేజేతులా కోల్పోయింది. ఛేదనలో చివరి వరకూ మ్యాచ్ ఆ జట్టు చేతుల్లోనే ఉన్నా గెలుపు తీరాలకు చేరలేకపోయింది. మరోవైపు, సౌతాఫ్రికా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్నారు. ఓపెనర్ తాంజిద్ హసన్(0)ను రబాడా రెండో ఓవర్‌లోనే అవుట్ చేయగా.. లిటాన్ దాస్(9), షకీబ్(3) నిరాశపరిచారు. కెప్టెన్ శాంటో(14) కూడా ఆదుకోలేకపోయాడు. ఈ సమయంలో తౌహిద్ హృదోయ్(37), మహ్మదుల్లా(20) కలిసి జట్టును విజయం వైపు నడిపించారు. 18 బంతుల్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా బంగ్లా గెలిచేలా కనిపించింది. ఈ పరిస్థితుల్లో తౌహిద్ హృదోయ్‌ను అవుట్ చేసి రబాడా మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఇక, చివరి ఓవర్‌లో బంగ్లాకు 11 పరుగులు కావాల్సి ఉండగా.. స్పిన్నర్ మహరాజ్ మాయ చేశాడు. జాకర్ అలీ(8), మహ్మదుల్లా‌లను అవుట్ చేయడంతోపాటు 6 పరుగులే ఇవ్వడంతో సౌతాఫ్రికా ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. సౌతాఫ్రికా బౌలర్లలో మహరాజ్ 3 వికెట్లు, రబాడా, నోర్జే రెండేసి వికెట్లతో సత్తాచాటారు.

స్కోరుబోర్డు

సౌతాఫ్రికా ఇన్నింగ్స్ : 113/6(20 ఓవర్లు)

డికాక్(బి)తాంజిమ్ హసన్ 18, హెండ్రిక్స్ ఎల్బీడబ్ల్యూ(బి)తాంజిమ్ హసన్ 0, మార్‌క్రమ్(బి)తస్కిన్ అహ్మద్ 4, ట్రిస్టన్ స్టబ్స్(సి)షకీబ్(బి)తాంజిమ్ హసన్ 0, క్లాసెన్(బి)తస్కిన్ అహ్మద్ 46, మిల్లర్(బి)రిషద్ హుస్సేన్ 29, జాన్సెన్ 5 నాటౌట్, మహరాజ్ 4 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 7.

వికెట్ల పతనం : 11-1, 19-2, 23-3, 23-4, 102-5, 106-6

బౌలింగ్ : తాంజిద్ హసన్(4-0-18-3), తస్కిన్ అహ్మద్(4-0-19-2), ముస్తాఫిజుర్(4-0-18-0), రిషద్ హుస్సేన్(4-0-32-1), షకీబ్(1-0-6-0), మహ్మదుల్లా(3-0-17-0)

బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ : 109/7(20 ఓవర్లు)

తాంజిద్ హసన్(సి)డికాక్(బి)రబాడా 9, శాంటో(సి)మార్‌క్రమ్(బి)నోర్జే 14, లిటాన్ దాస్(సి)మిల్లర్(బి)మహరాజ్ 9, షకీబ్ అల్ హసన్(సి)మార్‌క్రమ్(బి)నోర్జే 3, తౌహిద్ హృదోయ్ ఎల్బీడబ్ల్యూ(బి)రబాడా 37, మహ్మదుల్లా(సి)మార్‌క్రమ్(బి)మహరాజ్ 20, జాకర్ అలీ(సి)మార్‌క్రమ్(బి)మహరాజ్ 8, రిషద్ హుస్సేన్ 0 నాటౌట్, తస్కిన్ అహ్మద్ 1 నాటౌట్; ఎక్స్‌ట్రాలు 8.

వికెట్ల పతనం : 9-1, 29-2 , 37-3, 50-4, 94-5, 107-6, 108-7

బౌలింగ్ : జాన్సెన్(4-0-17-0), రబాడా(4-0-19-2), బార్ట్‌మన్(4-0-27-0), మహరాజ్(4-0-27-3), నోర్జే(4-0-17-2)

Advertisement

Next Story

Most Viewed