బంగ్లాతో వార్మప్ మ్యాచ్.. టీమ్ ఇండియా ప్రశ్నలకు సమాధానాలు దొరికేనా?

by Harish |
బంగ్లాతో వార్మప్ మ్యాచ్.. టీమ్ ఇండియా ప్రశ్నలకు సమాధానాలు దొరికేనా?
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇక మిగిలింది ఒక్క రోజే. భారత కాలమానం ప్రకారం ఆదివారం నుంచి పొట్టి ప్రపంచకప్ మొదలుకానుంది. టీమ్ ఇండియా టైటిలే లక్ష్యంగా ఈ మెగా ఈవెంట్‌లో బరిలోకి దిగబోతోంది. జూన్ 5న ఐర్లాండ్‌తో ఆడటం ద్వారా టోర్నీని మొదలుపెట్టనుంది. పొట్టి ప్రపంచకప్ సమరానికి ముందు భారత జట్టు వార్మప్ మ్యాచ్‌కు సిద్ధమైంది. రేపు న్యూయార్క్ వేదికగా బంగ్లాదేశ్‌తో తలపడనుంది.

టీమ్ ఇండియా సొంతగడ్డపై జనవరిలో ఆఫ్ఘనిస్తాన్‌తో చివరి టీ20 సిరీస్‌లో పాల్గొంది. అనంతరం భారత ఆటగాళ్లు ఐపీఎల్‌లో రెండు నెలలు బిజీ బిజీగా గడిపారు. మే 26న ఐపీఎల్ ఫైనల్ జరిగింది. ఆ వెంటనే భారత ఆటగాళ్లు న్యూయార్క్‌కు వచ్చారు. ఈ క్రమంలో ప్రపంచకప్ కోసం సన్నద్ధమయ్యేందుకు కావాల్సిన సమయం టీమ్ ఇండియాకు లభించలేదు. అమెరికాలో మ్యాచ్‌లు ఆడటం ఇదే తొలిసారి. కాబట్టి, టోర్నీలో రాణించాలంటే అక్కడి పరిస్థితులు, పిచ్ అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకు బంగ్లాతో వార్మప్ మ్యాచ్‌ను సద్వినియోగం చేసుకుంటామని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.

అలాగే, టీమ్ కాంబినేషన్‌పై ఒక అవగాహనకు రావడానికి కూడా టీమ్ ఇండియాకు ఈ వార్మప్ మ్యాచ్ ఉపయోగపడనుంది. గ్రూపు దశ మ్యాచ్‌లన్నీ భారత్ అమెరికాలోనే ఆడనుంది. అందులో మూడు మ్యాచ్‌లు న్యూయార్క్‌ వేదికగానే జరగనున్నాయి. జూన్ 9న జరిగే పాక్‌తో మ్యాచ్ కూడా ఇక్కడే జరగనుంది. కాబట్టి, న్యూయార్క్ పిచ్‌ను అర్థం చేసుకోవడం టీమ్ ఇండియా చాలా కీలకం. యశస్వి జైశ్వాల్, శివమ్ దూబె విషయంలో ఓ అంచనాకు రావొచ్చు. అలాగే, వికెట్ కీపర్ రోల్‌ కోసం రిషబ్ పంత్, సంజూ శాంసన్‌ పోటీ పడుతుండగా దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్ ఓ స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. తుది జట్టులో స్టార్ పేసర్ బుమ్రాకు చోటు ఖాయమే. అయితే, మరో స్థానం కోసం సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ పోటీపడుతున్నారు. వార్మప్ మ్యాచ్ ద్వారా ఈ ప్రశ్నకు కూడా సమాధానం దొరికే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు స్టార్ విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటంపై సందిగ్ధం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed