నేషనల్ హైవేపై లారీ దగ్ధం.. డ్రైవర్ సజీవదహనం

by GSrikanth |
నేషనల్ హైవేపై లారీ దగ్ధం.. డ్రైవర్ సజీవదహనం
X

దిశ, కూసుమంచి: ప్రమాదవశాత్తు డీసీఎం లారీ దగ్ధమైన ఘటన ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని గురువాయిగూడెం సమీపంలో నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని అనకాపల్లి జిల్లా నుండి హైదరాబాద్‌కు కెమికల్‌లోడ్‌తో వెళ్తున్న డీసీఎం లారీలో గురువాయిగూడెం రాగానే ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో లారీ పూర్తిగా కాలిబూడిదైపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సజీవ దహనం కాగా, డ్రైవర్‌కు తోడుగా ఉన్న వాహన యజమానికి తీవ్ర గాయాలు అయ్యాయి.

గమనించిన ఇతర వాహనదారులు ఆయన్ను బయటకు లాగి ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వాహనాదారులు పోలీసులకు, హైవే పెట్రో సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా పోలీసులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో లారీ చూస్తుండగానే పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Advertisement

Next Story

Most Viewed