బైక్ కోసం బావమరిది హత్య…

by Kalyani |
బైక్ కోసం బావమరిది హత్య…
X

దిశ, భిక్కనూరు: దొంగిలించుకు వచ్చిన బైకును ఎలాగైనా ఒక్కడే సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో, వరుసకు బావమరిది అయిన ఒకరిని బావ పథకం ప్రకారం హత్య చేసి కటకటాల పాలైన సంఘటన వెలుగు చూసింది. హత్యకు సంబంధించి సిఐ సంపత్ కుమార్ భిక్కనూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం దామర చెరువు గ్రామానికి చెందిన జెర్రిపోతుల బాబా శేఖర్, భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన కోటన్ రంజిత్ వరుసకు బావ, బామ్మర్దులు. ఇరువురు కలిసి కొద్ది రోజుల క్రితం ఒక బైకును దొంగిలించుకు వచ్చారు. బైకును రామాయంపేట లోని ఒక ప్రాంతంలో సేఫ్ గా ఉంచారు.

ఇద్దరు కలసి ఈ నెల 3న భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలోని దుకాణంలో కల్లు తాగారు. అక్కడి నుంచి భిక్కనూరు మండల కేంద్రంలోని రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయం సమీపంలో ఉన్న దుకాణానికి చేరుకొని, మళ్లీ చెరో సీసా కల్లు తాగేందుకు వచ్చారు. దొంగిలించుకు వచ్చిన బైక్ ను ఎలాగైనా ఒక్కడినే దక్కించుకోవాలన్న అత్యాశతో, వరుసకు బావ అయిన బాబా శేఖర్ పథకం ప్రకారం ముందుగా వెంట తెచ్చుకున్న గడ్డి మందును, బామ్మర్ది అయిన రంజిత్ ను బజ్జీలు తీసుకురమ్మని పంపించి, అప్పటికే తెప్పించుకున్న కల్లు సీసాలో గడ్డి మందును కలిపాడు. గడ్డి మందు తాగిన రంజిత్ కొద్దిసేపటి తరువాత కింద పడిపోవడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రంజిత్ ను సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈనెల 14న మృతి చెందాడు. అయితే మృతుడి వాంగ్మూలం ఆధారంగా విచారణ జరపగా, బావ జెర్రిపోతుల బాబా శేఖర్ ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రెండు బైకులు, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని, రిమాండ్ కు పంపించినట్లు వివరించారు. ఈ సమావేశంలో భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్, సిబ్బంది పాల్గొన్నారు.

Next Story