మద్యం మత్తులో గొడవ... కత్తితో దాడి...

by Sridhar Babu |
మద్యం మత్తులో గొడవ... కత్తితో దాడి...
X

దిశ, కూకట్​పల్లి : మద్యం సేవిస్తుండగా స్నేహితుల మధ్య జరిగిన గొడవ కత్తితో దాడికి దారి తీసిన సంఘటన కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్​పల్లి ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్న మిరిజపూరే పార్వతి తన కొడుకు జగదీష్​, కూతురు స్వప్నలతో కలిసి నివాసం ఉంటుంది. జగదీష్​ స్థానికంగా ఆటో నడుపుతుంటాడు. అదే కాలనీలో నివాసం ఉండే జగదీష్​ స్నేహితుడు బూక్య వినోద్ కుటుంబ సభ్యులు సొంతూరుకు వెళ్లడంతో వినోద్​ జగదీష్​తో పాటు మరో స్నేహితుడు సాయి కుమార్​లను ఇంటికి పిలిపించి ముగ్గురు కలిసి మద్యం సేవించారు. మద్యం సేవిస్తుండగా బూక్య వినోద్​, జగదీష్​ల మధ్య చిన్న గొడవ పరస్పర దాడికి కారణమైంది.

ఈ క్రమంలో జగదీష్​పై వినోద్​ కర్రతో దాడి చేశాడు. దీంతో జగదీష్​ అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చి తనపై బూక్య వినోద్​ దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడని తల్లి పార్వతికి చెప్పాడు. దీంతో పార్వతి వినోద్​ ఇంటికి వెళ్లి తన కొడుకుపై ఎందుకు దాడి చేశావని అడిగింది. దీంతో పార్వతి, జగదీష్​లను వినోద్​ దుర్భాషలాడుతూ మరోసారి గొడవ పెట్టుకున్నాడు. వినోద్​ ఇంటి నుంచి జగదీష్​, పార్వతిలు ఇంటికి తిరిగి వస్తుండగా వెనక నుంచి వచ్చిన బూక్య వినోద్​ తనతో పాటు తెచ్చుకున్న కత్తితో జగదీష్​ ఛాతి భాగంలో దాడి చేశాడు. జగదీష్​ను తప్పించేందుకు ప్రయత్నించి పార్వతి ఎడమ భుజానికి కత్తితో గాయం అయింది. దీంతో పార్వతి, జగదీష్​లు అందించిన సమాచారం మేరకు కూకట్​పల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పార్వతి, జగదీష్​లను చికిత్స నిమిత్తం గాంధీకి తరలించి బూక్య వినోద్​పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed