నీటి దందా ముఠాకు 8 ఏళ్ల బాలుడు బలి

by Aamani |
నీటి దందా ముఠాకు  8 ఏళ్ల బాలుడు బలి
X

దిశ, శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ వట్టి నాగులపల్లి లో విషాదం చోటుచేసుకుంది. నీటి మాఫియా ముఠా ధనదాహానికి అన్యం పుణ్యం ఎరుగని ఓ బాలుడు మృత్యువాత పడ్డాడు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వెంకటేష్, కవితలు బ్రతుకుదెరువు నిమిత్తం పిల్లలతో నగరానికి వలస వచ్చి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లి లో నివాసం ఉంటున్నారు. అయితే వీరి కుమారుడు శ్రీనివాస్ (8) స్థానికంగా ఉన్న పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాడు. వినాయక చవితి, ఆదివారం రెండు రోజులు సెలవులు రావడంతో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఆదివారం ఉదయం శ్రీనివాస్ తల్లిదండ్రులు పనికి వెళ్లగా శ్రీనివాస్ ఆడుకునేందుకు బయటకు వెళ్లాడు. అయితే రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది.

దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం వట్టి నాగులపల్లిలో నీళ్లు నిలువ చేసిన‌ నీటి గుంటలో బాలుడి మృతదేహం తేలుతూ కనిపించింది. ఆడుకునే క్రమంలో ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి మృతి చెందినట్లు తెలుస్తోంది. బాలుడి శవం చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వట్టినాగులపల్లి లో కొందరు వ్యక్తులు ముఠాగా ఏర్పడి నీటి దందా చేస్తున్నారని, నీళ్లను ట్యాంకర్ల ద్వారా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి సరఫరా చేస్తున్న వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా, నిబంధనలకు విరుద్దంగా నీళ్లను అమ్ముకుంటున్నారని మండిపడుతున్నారు. గత నెలలో రెవెన్యూ అధికారులు నీటి గుంటలను జేసీబీతో కూల్చివేశారు. వారి నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని ఆరోపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed