ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ఇద్దరు దుర్మరణం

by Sridhar Babu |
ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు...ఇద్దరు దుర్మరణం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ రూరల్ మండలం శ్రీనగర్ వద్ద బుధవారం తెల్లవారు జామున రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో మాక్లూరు మండలం చిక్లీ గ్రామానికి చెందిన దండ్ల వంశీకృష్ణ (17), న్యాల్కల్ కు చెందిన రాజేష్ లు ప్రమాదంలో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. శ్రీనగర్ ప్రాంతంలోని గజానంద్ రైస్ మిల్లు పక్కన బురదలో దిగబడిన లారీని రెండు రోజులుగా తీయకుండా అలాగే వదిలేశారని, అదే ఘోర ప్రమాదానికి కారణమైందని స్థానికులు అంటున్నారు. నిజామాబాద్ నగరంలోని దుబ్బ నుంచి మాక్లూర్ మండలం చిక్లీ వైపు వెళ్తున్న కారులో ముగ్గురు యువకులు వెళ్తున్నారు.

తెల్లవారు జాము కావడంతో ట్రాఫిక్ ఎక్కువగా లేదని కారును వేగంగా నడుపుతున్న క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీని చూసి వేగాన్ని నియంత్రించే లోపే కారు వెళ్లి లారీని వేగంగా ఢీ కొట్టి ఉండొచ్చని సంఘటన స్థలాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. ప్రమాదంలో కారు పై కప్పు నుజ్జు నుజ్జయింది. ప్రమాద సమయంలో కారు డ్రైవింగ్ చేస్తున్న నిజామాబాద్ నగరంలోని దుబ్బకు చెందిన ఆకాశ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. మృతుడు వంశీ నిజామాబాద్ నగరంలోని ఓ హెూటల్ లో పని చేసేవాడని, జ్వరంతో బాధపడుతున్న అతడిని స్నేహితులు బయటికి తీసుకెళ్లారని తెలిసింది.

మృతుల్లో ఇంకో యువకుడు రాజేశ్ కుమార్ గల్లీలోని ఓ కిరాణా దుకాణంలో పని చేసే వాడని తెలిసింది. కుటుంబ సభ్యులతో కలిసి నగరంలోనే ఉంటున్నాడు. నిజామాబాద్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్రేక్ డౌన్ అయిన లారీని వెంటనే రోడ్డుపై నుంచి పక్కకు తీయాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వదిలేయడం కారణంగానే ప్రమాదం జరిగి, ఇద్దరు యువకుల నిండు ప్రాణాల్లో గాలిలో కలిసి పోయాయని గ్రామస్తులు, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళన నిర్వహించారు. అప్పటి వరకు మృతదేహాలను అక్కడి నుంచి కదిలించేదే లేదని భీష్మించారు. పోలీసులతో వాగ్వాదానికి సైతం దిగారు. మృత దేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తరువాత మృతదేహాలను తీసుకువచ్చి రైస్ మిల్లు ఎదుట ఆందోళన చేస్తామని బాధిత కుటుంబాలు హెచ్చరించాయి.

Advertisement

Next Story

Most Viewed