‘అయోధ్య మసీదు’ మొదటి ఇటుకపై నిర్మాణ కమిటీలో విభిన్న వాదనలు

by Hajipasha |
‘అయోధ్య మసీదు’ మొదటి ఇటుకపై నిర్మాణ కమిటీలో విభిన్న వాదనలు
X

దిశ, నేషనల్ బ్యూరో : రామజన్మభూమి కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయోధ్య జిల్లాలోని ధన్నీపూర్ గ్రామంలో కేటాయించిన ప్రదేశంలో కొత్త మసీదు నిర్మాణానికి కసరత్తు జరుగుతోంది. కొత్తగా నిర్మించబోయే మసీదుకు ‘ముహమ్మద్ బిన్ అబ్దుల్లా’ అనే పేరును ఖరారు చేశారు. ఈ మసీదు కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న హాజీ అరాఫత్ షేక్‌ ఇటీవల ఓ ప్రకటన చేశారు. మసీదు నిర్మాణం కోసం వాడబోయే మొదటి ఇటుకను మక్కా, మదీనాలకు తీసుకెళ్లి పవిత్రం చేసి ముంబైకి తీసుకొచ్చామని హాజీ అరాఫత్ వెల్లడించారు. రంజాన్ పండుగ తర్వాత ఏప్రిల్ నెలలో ఈ ఇటుకను ముంబై నుంచి అయోధ్య జిల్లా ధన్నీపూర్ మసీదుకు ఊరేగింపుగా తీసుకెళ్తామని ఆయన చెప్పారు. అయితే హాజీ అరాఫత్ చేసిన ప్రకటనపై ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్‌ ఛైర్మన్, ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ చీఫ్ ట్రస్టీ జుఫర్ ఫరూఖీ విభిన్నంగా స్పందించారు. మొదటి ఇటుకను మక్కా, మదీనాలలో పవిత్రం చేసి తీసుకొచ్చిన అంశంపై తమకు ఎలాంటి అధికారిక సమాచారం లేదని స్పష్టంచేశారు. దీనిపై జరుగుతున్న ప్రచారానికి స్పందించాలని హాజీ అరాఫత్‌కు సూచిస్తానని వెల్లడించారు. మసీదు నిర్మాణానికి విరాళాలను సేకరిస్తున్న ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి అథర్ హుస్సేన్‌ కూాడా మొదటి ఇటుకపై తనకు సమాచారం లేదన్నారు. ధన్నీపూర్‌లో నిర్మించబోయే మసీదు 21 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మసీదులో ప్రపంచంలోనే అతిపెద్ద పవిత్ర ఖురాన్ ఉంటుంది. ఈ పవిత్ర ఖురాన్ తెరిచినప్పుడు 18.18 అడుగుల మేర విస్తరించి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed