24 గంటల్లో 9,883 కొత్త కేసులు

by vinod kumar |
24 గంటల్లో 9,883 కొత్త కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజులో తొమ్మిది వేలకుపైగా కేసులు నమోదవడం సర్వ సాధారణమైపోయింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,883 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోమవారం ఉదయం కేంద్ర ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,56,611కి చేరాయి. ఒక్కరోజే కరోనాతో 206 మంది చనిపోగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 7,135 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇప్పటివరకు 1,24,094 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, 1,25,381 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. కరోనా కేసుల్లో దేశం ప్రపంచంలోనే 5వ స్థానంలో కొనసాగుతోంది. దేశంలో కరోనా కేసులు చైనాతో పోలిస్తే మూడు రెట్లు అవడానికి అత్యంత సమీపంలో ఉంది.

మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు తీవ్రమవుతోంది. దేశంలోనే ఇప్పటివరకు ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 2,553పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 88,528కి చేరింది. దేశంలోని మహారాష్ట్రలో నమోదైన కేసులే చైనాలో మొత్తం కేసులను దాటేయడం గమనార్హం. ఇక్కడ ఒక్కరోజులోనే 109 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 3,169కి చేరింది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,536పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఇప్పటివరకు 1702 మంది కరోనాతో మరణించారు. ముంబైలో మొత్తం కేసుల సంఖ్య 50,085కి చేరింది.

తమిళనాడులో ఒక్కరోజే 1562 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య33,229కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 17 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 286కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కరోజే 1007 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 29,943కు చేరింది. ఢిల్లీలో ఒక్కరోజే కరోనాతో 17 మంది చనిపోగా ఇప్పటివరకు 874 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్‌లో ఒక్కరోజే 477కొత్త కేసులు నమోదవగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య20,574కు చేరింది. రాష్ట్రంలో ఒక్కరోజే 31 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు ఇక్కడ వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1280కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 125 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 3,843కి చేరింది. ఇక్కడ ప్రస్తుతం 1381 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటివరకు 75 మంది మరణించారు.

Advertisement

Next Story

Most Viewed