గుడిసెల్లో కాదు.. బిల్డింగుల్లోనే అధికంగా వైరస్ వ్యాప్తి..!

by Shamantha N |
గుడిసెల్లో కాదు.. బిల్డింగుల్లోనే అధికంగా వైరస్ వ్యాప్తి..!
X

ముంబయి : కరోనా వైరస్ ఎక్కువ మంది గుమిగూడి ఉండే మురికివాడల్లో అధికంగా వ్యాపిస్తుందనే అపోహ చాలామందిలో ఉంది. బిల్డింగుల్లో ఉండేవారికి ఉండే సదుపాయాలు, సౌకర్యాలతో పోలిస్తే మురికివాడల్లో బతుకుబండిని ఈడ్చే ప్రజలకు ఉండవు. దాంతో భవనాల్లో వారి కంటే స్లమ్స్ లోని గుడిసెల్లోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని బావిస్తారు. కానీ కరోనా రెండో దశలో మాత్రం ఈ భావన తప్పని తేలుతుంది. గుడిసెల్లో ఉండే వారికంటే పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్‌మెంట్లలో ఉండేవారిలో మహమ్మారి ఎక్కువ వ్యాపిస్తుందని ఓ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా కొవిడ్ రెండో దశ తీవ్రంగా ఉన్న మహారాష్ట్ర రాజధాని ముంబయిలో స్లమ్స్‌లో ఉండేవారికంటే బిల్డింగుల్లో నివసిస్తున్నవారే కరోనా బారిన పడుతున్నారని నివేదికలో తేలింది.

వివరాల్లోకెళ్తే.. బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలో ఏప్రిల్ 16 వరకు సెకండ్ వేవ్‌లో భాగంగా నమోదైన మొత్తం కేసుల (87,443) లో సుమారు 90 శాతం కేసులు (79,032) బిల్డింగులు, అపార్ట్‌మెంట్ ఏరియాలలోనే నమోదయ్యాయి. 8,411 మంది కేసులు స్లమ్స్ నుంచి ఉన్నాయి. గతేడాది జూన్ లో అప్పటివరకు నమోదైన మొత్తం కేసులలో 57శాతం స్లమ్స్ నుంచే ఉన్నాయి. ఆ సమయంలో స్లమ్స్ లో నివసించే సుమారు 42 లక్షల మందిని కంటైన్‌మెంట్ జోన్లలో ఉంచారు. ఆగస్టులో 45 శాతం కేసులు స్లమ్స్ నుంచి నమోదయ్యాయి.

బీఎంసీ గణాంకాల ప్రకారం.. ఈ సర్వే నిర్వహించే సమయానికి ముంబయిలో అత్యంత ఖరీదైన ప్రాంతాలైన అంధేరి, జోగేశ్వరిలలో 273 బిల్డింగులను కలిపి అధికారులు కంటైన్‌మెంట్ జోన్ విధించారు. మలబార్ హిల్, గ్రాంట్ రోడ్డు పరిధిలోని 247 భవనాలు.. పరేల్, సెవెరిలోని ఎఫ్-సౌత్ లో 147 బిల్డింగులు కంటైన్మెంట్ జోన్ లకి వెళ్లాయి. బిల్డింగులు, అపార్ట్‌మెంటులలో నివసిస్తున్న సుమారు 20 లక్షల మంది ప్రజలు ప్రస్తుతం వారి ఇంటిని దాటి బయటకు రావడం లేదు.

Advertisement

Next Story

Most Viewed