యూపీలో కొవిడ్ విలయతాండవం.. కరోనా కాటుకు 577 మంది టీచర్లు బలి

by vinod kumar |   ( Updated:2021-04-29 06:01:29.0  )
యూపీలో కొవిడ్ విలయతాండవం.. కరోనా కాటుకు 577 మంది టీచర్లు బలి
X

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తున్నది. కొవిడ్-19 బారిన పడి అక్కడ 577 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మరణించినట్టు టీచర్స్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు యూపీ శిక్షక్ మహాసంఘ్ (యూపీఎస్ఎం) అధ్యక్షుడు దినేశ్ చంద్ర శర్మ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. ఇటీవలే యూపీలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. చనిపోయిన టీచర్లంతా ఈ ఎన్నికల విధుల్లో పాల్గొని కరోనా రావడంతో ఆరోగ్యం క్షీణించి చనిపోయారని దినేశ్ చంద్ర ఆరోపించారు. 71 జిల్లాల్లో పోలింగ్ విధుల్లో పాల్గొన్న టీచర్లు, ఇతర సిబ్బంది కరోనా కాటుకు బలయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో కరోనా స్వైర విహరం కొనసాగుతుండగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయినా యోగి సర్కారు మాత్రం దీనిపై వెనక్కి తగ్గలేదు. పంచాయతీ ఎన్నికల విధుల్లో పాల్గొని మరణించిన వారిపై నివేదిక ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టు ఎన్నికల కమిషన్‌ను ఆదేశించిన నేపథ్యంలో యూపీఎస్ఎం ప్రతినిధులు ఈసీని కలిసి ఈ నివేదిక అందజేశారు. ఈ సందర్భంగా మే 2 న వెలువడనున్న ఫలితాలను నిలిపేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed